Santosh Shoban New Movie : 'జోరుగా హుషారుగా షికారు పోదమ' - కొత్త సినిమాతో వచ్చిన సంతోష్ శోభన్
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జోరుగా హుషారుగా షికారు పోదమ'. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ లాంచ్ చేశారు.
సక్సెస్ కోసం యువ హీరో సంతోష్ శోభన్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా సరైన హిట్టు కోసం కష్టపడుతున్న సంతోష్.. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. 'కళ్యాణం కమణీయం', 'శ్రీదేవి శోభన్ బాబు', 'అన్నీ మంచి శకునములే', 'ప్రేమ్ కుమార్' సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు 'జోరుగా హుషారుగా షికారు పోదమ' అంటూ వస్తున్నాడు.
సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'జోరుగా హుషారుగా షికారు పోదమ'. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఫల్గుణి ఖన్నా హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. 'హరి హర వీరమల్లు' డైరెక్టర్ క్రిష్ దీనికి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.
'జోరుగా హుషారుగా షికారు పోదమ' అనేది రొమాంటిక్ ఫన్ ఫుల్ ట్రావెలింగ్ స్టోరీ అని మోషన్ పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. ఇండియా మ్యాప్ మీద హీరో హీరోయిన్లను చూపిస్తూ, సినిమా కాన్సెప్ట్ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశారు. సంతోష్ - ఫల్గుణి జంట తమ జర్నీని బస్ తో మొదలుపెట్టి.. కార్లు, ట్రైన్లు, విమానాల్లో దేశమంతా చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మ్యూజిక్ ఆకట్టుకుంటోంది.
Also Read: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు - ఆత్మహత్యలపై విజయ్ ఆంటోని ఏం మాట్లాడారంటే?
ఫస్ట్ లుక్ లో హీరోయిన్ పల్గుని ఖన్నా ఒక ట్రాలీ మీద కూర్చొని కన్ను గీటగా.. హీరో సంతోష్ వెనుక నిలబడి ఆ ట్రాలీని నెడుతూ కనిపించాడు. బ్యాగ్రౌండ్ లో ఫ్లైట్ టికెట్స్, ట్రెయిన్ టిక్కెట్లతో పాటుగా భారతదేశం చిత్ర పటాన్ని మనం చూడొచ్చు. వీరిద్దరి ప్రేమాయణం ఎలా సాగింది? ఈ ప్రయాణం ఎక్కడికి? జోరుగా హుషారుగా షికారు వెళ్లే క్రమంలో ఏం జరిగింది? అసలు కథేంటి? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
'జోరుగా హుషారుగా షికారు పోదమా' అనేది అక్కినేని నాగేశ్వరరావు - సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన 'భార్యా భర్తలు' సినిమాలోని క్లాసిక్ సాంగ్. ఆ లిరిక్స్ ని ఇప్పుడు సంతోష్ శోభన్ తన చిత్రానికి టైటిల్ గా పెట్టుకున్నాడు. ఇది కలిసొచ్చి ఈసారైనా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొడతాడేమో వేచి చూడాలి.
'జోరుగా హుషారుగా షికారు పోదమ' చిత్రాన్ని మిస్టర్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టోరీ క్యాట్ ఎంటర్టైన్మెంట్స్ & ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రవీణ్ నంబారు, రవి చెన్నా, సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగ వంశీ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అనిల్ కుమార్. పి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని 2023 వింటర్ సీజన్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు - ప్రోమోతో అదరగొట్టిన మాస్ రాజా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial