Tiger Nageswara Rao: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు - ప్రోమోతో అదరగొట్టిన మాస్ రాజా!
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమా నుంచి 'వీడు' అనే సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. విజయ దశమి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే 'ఏక్ దమ్ ఏక్ దమ్' అనే ఫస్ట్ సింగిల్ కూడా మాస్ రాజా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'వీడు' అనే రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఐదు భాషల్లో సాంగ్ ప్రోమోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
''అందరు ఆగిపోయిన చోట మొదలవుతాడు వీడు.. అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు.. అవసరం అనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు.. సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయేవాడు వీడు..'' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ ఎలా ఉంటుందనేది ఈ సాంగ్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేసారు. ఒక పాట మాదిరిగా కాకుండా, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లా ఈ ప్రోమోని కట్ చేసారు. రవితేజ మాస్ లుక్ లో చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. మాస్ రాజా చాలా రోజుల తర్వాత ఇలాంటి పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడని ఈ వీడియోతో అర్థమవుతోంది.
రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా 'వీడు' పాటకు ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా గీత రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. ఈ సాంగ్ లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ మధే కెమెరా పనితనం కనిపిస్తుంది. అవినాష్ కొల్లా ఆర్ట్ డిజైనర్ గా వర్క్ చేయగా.. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసారు. 'వీడు' ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కాగా, 70వ దశకంలో స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగగా చలామణి అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగేశ్వరరావు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, ప్రచారంలో ఉన్న కొన్ని రూమర్స్ ఆధారంగా కథ రాసుకున్నారు. రవితేజ పాత్రను రాబిన్ హుడ్ తరహాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ విస్సా దీనికి డైలాగ్స్ రాసారు. సీనియర్ నటి రేణూ దేశాయ్ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ రచయిత్రి, భారతీయ సంఘ సంస్కర్త. సాహితీ ప్రియులకు సుపరిచితులైన గుర్రం జాషువా కుమార్తె డా. హేమలత లవణం పాత్రలో ఆమె కనిపించనుంది. అలానే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'టైగర్ నాగేశ్వరరావు' అనేది రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Also Read: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు - ఆత్మహత్యలపై విజయ్ ఆంటోని ఏం మాట్లాడారంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial