Sai Dharam Tej: ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్ - మళ్లీ సినిమాలకు బ్రేక్, ఈసారి దేనికీ?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా 'బ్రో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాను సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.
రీసెంట్ గా 'విరూపాక్ష' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఉన్నట్టుండి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడట. ఏకంగా ఆరు నెలల పాటు తాను సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ విని ఫాన్స్ షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కెరీర్ మంచి సక్సెస్ ట్రాక్ పైనే ఉంది. అలాంటిది సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఈమధ్యే 'విరూపాక్ష' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తేజుకి ఊహించని విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
'విరూపాక్ష' తర్వాత తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ సంపత్ నందితో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమా తర్వాతే తాను సుమారు 6 నెలల పాటు బ్రేక్ తీసుకోవాలనుకున్నట్లు వెల్లడించాడు. తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నానని, ఈ విషయాన్ని తన అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పాడు. తాజాగా 'బ్రో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయితేజ్ ఈ విషయాన్ని వెల్లడించారు." అభిమానుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఉండవని భావిస్తున్నాను. నా అన్ని సినిమాలకు పూర్తిస్థాయి ఎఫర్ట్ ఉండాలని అనుకుంటాను. నేను ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. సర్జరీ తర్వాత మరింత బలంగా మీ ముందుకు వస్తాను. నేను పూర్తిగా కోలుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పట్టొచ్చు" అంటూ సాయి తేజ్ తెలిపారు.
ఇక అటు ఫ్యాన్స్ కూడా సాయి తేజ్ సర్జరీ సక్సెస్ అవ్వాలని మరింత త్వరగా కోలుకొని మళ్ళీ మంచి మంచి సినిమాలు చేయాలంటూ కోరుకుంటున్నారు. ఇక 'విరూపాక్ష' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్రో' కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు. మొదటిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో ఈ మామ, అల్లుళ్ళ కాంబినేషన్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక 'బ్రో' మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'వినోదయ సీతం' సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రీమేక్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : కుడి ఎడమైతే పొరపాటు లేదో, 'బిగ్ బాస్' ప్రోమోతో తిరిగొచ్చిన కింగ్ నాగ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial