Tollywood: ఇండిపెండెన్స్ డే వార్ - అందరికీ హిట్టు కావలెను!
Independence Day Movies: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిల్లో నాలుగు తెలుగు చిత్రాలు, ఒక తమిళ డబ్బింగ్ మూవీ, మూడు హిందీ మూవీస్ ఉన్నాయి.
Independence Day Movies: ఇండిపెండెన్స్ డేకి టాలీవుడ్ లో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోడానికి 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్', 'తంగలాన్' వంటి మూడు పెద్ద సినిమాలు ఆగస్టు 15న రిలీజ్ అవుతున్నాయి. రెండు మాస్ కమర్షియల్ తెలుగు చిత్రాలైతే, మరికొకటి డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన తమిళ డబ్బింగ్ మూవీ అవ్వడం గమనార్హం. ఈ మూడూ పాపులర్ హీరోలు, ప్రముఖ దర్శకుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులే కావడంతో బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, వీటిల్లో భాగమైన వారందరికీ ఈ సినిమాలు తప్పకుండా హిట్ అవ్వాల్సిన అవసరముంది.
పూరీ జగన్నాథ్ దర్శకనిర్మాణంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఇది 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్. రామ్ 'ది వారియర్' 'స్కంద' సినిమాలతో పరాజయాలు చవిచూశారు. అతని మార్కెట్ దెబ్బతినకుండా ఉండాలంటే ఇప్పుడు కచ్ఛితంగా సక్సెస్ సాధించాలి. లైగర్ మూవీతో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ పూరీ.. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. బ్లాక్ బస్టర్ కొట్టి తాను ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానని అందరికీ తెలియజెప్పాలని భావిస్తున్నారు. నిర్మాతగా ఛార్మి కౌర్ కు, మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మకు కూడా మంచి సక్సెస్ కావాలి.
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ రుచి చూసిన తర్వాత మాస్ మహారాజా మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి ఈ మూవీ కీలకంగా మారింది. 'గద్దలకొండ గణేష్' తర్వాత దాదాపు 5 ఏళ్లకు హరీష్ శంకర్ నుంచి రాబోతున్న చిత్రమిది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎప్పుడు తిరిగి సెట్స్ మీదకి వెళ్తుందో తెలియదు. కానీ, అంతకంటే ముందే తన స్టామినా ఏంటో చూపించాల్సి ఉంది.
మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, విలక్షణ దర్శకుడు పా. రంజిత్ కాంబోలో రూపొందుతున్న హిస్టారికల్ ఫాంటసీ చిత్రం 'తంగలాన్'. ప్రయోగాత్మక సినిమాలకు ప్రసిద్ది చెందిన విక్రమ్ సోలోగా కమర్షియల్ హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. అందుకే ఇప్పుడు ఈ పీరియాడికల్ థ్రిల్లర్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇలా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వీరందరికీ ఈ సినిమాలు కీలకంగా మారాయి. అయితే వీటితో పాటుగా మరో రెండు చిన్న సినిమాలతో పాటుగా మూడు హిందీ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'ఆయ్'.. రానా దగ్గుబాటి సమర్పణలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన '35 - చిన్న కథ కాదు' సినిమాలు ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్నాయి. అలానే రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ 2'.. జాన్ అబ్రహం, తమన్నా భాటియాల 'వేదా'.. అక్షయ్ కుమార్, తాప్సీ పొన్ను, ప్రగ్యా జైస్వాల్ నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యాయి. అంటే ఓవరాల్ గా ఇండిపెండెన్స్ డేకి 8 సినిమాలు వస్తున్నాయి. మరి వీటిల్లో ఏవేవి ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయో చూడాలి.