Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...
ఒకప్పుడు యాక్టింగ్ రాదు.. ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ పండవన్న క్రిటిక్స్ తోనే ఈ రోజు నీరాజనాలు అందుకుంటున్నాడు చరణ్. ఆ రిమేక్ చిత్రంలో నటించి పలు విమర్శలు ఎదుర్కొన్నా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఔరా అనిపించాడు.
ఒకప్పుడు యాక్టింగ్ రాదు.. ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ పండవన్న క్రిటిక్స్ తోనే ఈ రోజు నీరాజనాలు అందుకుంటున్నాడు.. అతడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మార్చి 27న 38వ పుట్టినరోజును జరుపుకుంటుండగా.. అతనికి టాలీవుడ్ నుంచే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విషెస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్ ఫిల్మ్ 'జంజీర్'కు రిమేక్ గా తీసిన 'తుఫాన్' చేయడానికి గల కారణాలను ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
కొందరు ఫేమస్ హీరోల సినిమాలను రిమేక్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే భయపడతారు. అలాంటి హీరోల్లో తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు ఉండగా.. ఫ్యాన్స్ 'బిగ్ బీ' అని ప్రేమగా పిలుచుకునే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లాంటి వారున్నారు. ఈ తరహా హీరోల సినిమాలను రీమేక్ చేయాలంటే డైరెక్టర్లు సైతం ఆచితూచి వ్యవహరిస్తారు. కానీ రామ్ చరణ్ మాత్రం ధైర్యం చేశాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మూవీని రిమేక్ చేస్తూ.. ఏ హీరో చేయని సాహసాన్ని చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమానే 'తుఫాన్'. ఇది హిందీ చిత్రం ‘జంజీర్’కు రీమేక్.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో పాల్గొని సందడి చేశారు. అంతే కాకుండా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కు 'ఉత్తమ ఒరిజనల్ సాంగ్' కేటగిరీలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ స్టార్ డమ్ అమాంతం పెరిగింది. పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఉండడం ఇదేం కొత్త కాకపోయినప్పటికీ.. ఈ సినిమా తర్వాత ఆయనతో పాటు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసలు పొందారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన రామ్‌చరణ్.. 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత 'రచ్చ', నాయక్ లాంటి మాస్ ఫాలోయింగ్ ను చెర్రీ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సమయంలోనే బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా 1973లో ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ మూవీతో. 2013లో ఈ సినిమాను రిమేక్ చేయాలని నిర్ణయించారు. దీంతో అప్పట్లో రామ్ చరణ్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు అంచనాలు కూడా పెరిగాయి. అయితే, విడుదల తర్వాత నెగటివ్ టాక్ రావడంతో చరణ్ మళ్లీ బాలీవుడ్ వైపు తొంగి కూడా చూడలేదు.
అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ లాంటి వారే ఈ సినిమా రిమేక్ చేయడానికి సాహసించలేదని, అలాంటిది రామ్ చరణ్ ఆ సాహసం చేశాడంటూ అప్పట్లో ప్రశంసలు కూడా వచ్చాయి. అసలు రామ్ చరణ్ ఎందుకు ఈ మూవీ రీమేక్‌లో నటించాలని అనుకున్నాడు? ఆ పరిణామాలేంటీ? అనే విషయాలను రామ్ చరణ్ లో 2013లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘‘బాలీవుడ్ లోనే పెద్ద స్టార్ గా పిలుచుకునే అమితాబ్ బచ్చన్ సినిమా ‘జంజీర్’ను ఆయన కొడుకు కూడా చేయడానికి ఆలోచిస్తాడు. ఇది అత్యంత కష్టమైనది కూడా. అలాంటి మీరు దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు?’’ అని రామ్ చరణ్ ను ప్రశ్నించగా.. తాను ఒత్తిడిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని, బిగ్‌బీ చేసిన ఆ మూవీని చేయడం బాధ్యతగా ఫీలవుతున్నానని వెల్లడించాడు. అప్పట్లో ఆ మూవీ హిట్ కొట్టి ఉంటే.. చరణ్‌కు టర్నింగ్ పాయింటై ఉండేది. ఒక్కోసారి ఆలస్యం కూడా మంచిదేనని ‘ఆర్ఆర్ఆర్’తో ప్రూవ్ అయ్యింది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు.. ఏకంగా యావత్ ప్రపంచాన్నే చరణ్, తారక్‌లు ఆకట్టుకున్నారు. గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్నారు.