Rajinikanth: రజనీకాంత్ స్పీచ్‌లో హైలైట్స్... శృతి హాసన్ నుంచి లోకేష్ వరకు ఎవ్వర్నీ వదల్లేదు!
Coolie Audio Launch: సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి శృతి హాసన్ వరకు ఎవ్వర్నీ వదలకుండా పంచ్ డైలాగ్స్ వేశారు రజనీ.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు ఆడియన్స్ అందరినీ ఎంత ఎంటర్‌టైన్ చేస్తాయో... సినిమా వేడుకల్లో స్టేజిపై ఆయన ఇచ్చే స్పీచ్‌లోనూ అంతే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సెల్ఫ్ సెటైర్స్ వేసుకోవడంలో రజనీకాంత్ తర్వాతే ఎవరైనా! బట్ ఫర్ ఏ ఛేంజ్... 'కూలీ' ఆడియో లాంచ్ (Coolie Audio Launch)లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి కమల్ హాసన్ కుమార్తె - హీరోయిన్ శృతి హాసన్ వరకు అందరి మీద సెటైర్స్ వేశారు. పనిలో పనిగా ఆయన మీద కూడా సెటైర్స్ వేసుకున్నారు.
కమల్ హాసన్ ఫ్యాన్ అని చెప్పాడు!
'కూలీ' కథ చెప్పడానికి వచ్చినప్పుడు కమల్ హాసన్ ఫ్యాన్ అని లోకేష్ కనగరాజ్ తనకు చెప్పాడని రజనీకాంత్ వివరించారు. ''ఎవరి ఫ్యాన్? అని నేను అడిగానా! లేదు కదా! అప్పుడు ఎందుకు? పరోక్షంగా ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ ఉండవని, ఇదొక ఇంటెలిజెంట్ స్టోరీ అని చెప్పాడు'' అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు లోకేష్ కనగరాజ్ రెండు గంటల ఇంటర్వ్యూ ఇచ్చాడని, తాను ఎన్ని పనులు చేసుకుని చూసినా అది చూడటం పూర్తి కాలేదని సెటైర్ వేశారు.
కమల్ కంటే రజనీ సినిమా ఇంట్రెస్ట్!
'కూలీ' సినిమాలో శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్ గురించి లోకేష్ కనగరాజ్, తనకు మధ్య జరిగిన డిస్కషన్ కూడా రజనీకాంత్ చెప్పారు. ''సినిమాలో ఇక ఇంపార్టెంట్ ఫిమేల్ క్యారెక్టర్ ఉంది. అది ఎవరు చేస్తున్నారని అడిగా. శృతి హాసన్ అని లోకేష్ చెప్పాడు. నువ్వు అసలు ఆ అమ్మాయిని అడిగావా? లేదా? అని ప్రశ్నించా. శృతి హాసన్ ఓకే చెప్పిందని, ఫోన్ కోసం వెయిట్ చేస్తుందని అన్నాడు. నేను ఎప్పుడో '3' సినిమాలో శ్రుతిని చూశా. గ్లామర్ గాళ్. 'కూలీ'లో ఎలా చేస్తుందోనని అన్నాను. వాళ్ళ నాన్న సినిమాలో చేయడం కంటే మీ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తుందన్నాడు. నేను సరేనని అన్నాను'' అని రజనీకాంత్ తెలిపారు.
నా బాడీ 1950 మోడల్, జాగ్రత్త అన్నా!
అనిరుధ్ రవిచందర్ ఇండియాలో ఫస్ట్ రాక్ స్టార్ అన్నారు రజనీకాంత్. ఇప్పుడు అతని కెరీర్ పీక్ స్టేజిలో ఉందని, ఇండియాలో మాత్రమే కాదు - సౌత్ ఏషియాలో అనిరుధ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నారు. ఒక సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన శాండీ మాస్టర్ గురించి మాట్లాడుతూ... ''నేను శాండీకి ఒక్కటే చెప్పా! నాది 1950 మోడల్ బండి. బాడీ పార్ట్స్ రీప్లేస్ చేశాం. కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చెయమని'' అని అన్నారు. ఆ మాటలకు ఆడిటోరియంలో అందరూ నవ్వేశారు.
Also Read: వంద 'బాషా'లతో సమానం ఈ 'కూలీ'... నాగ్ స్పీచ్ దెబ్బకు తమిళనాడు షేక్!
లగేజ్ మోశాక 2 రూపాయలు ఇచ్చారు!
'కూలీ' ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తాను 'కూలీ'గా పని చేసిన రోజులను రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను చాలాసార్లు తిట్లు తిన్నానని తెలిపారు. ''ఒక రోజు ఓ మనిషి నాతో లగేజ్ మోయించుకుని రెండు రూపాయలు చేతిలో పెట్టాడు. ఇది టిప్ కింద ఉంచుకో అన్నాడు. వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందని చూశా. అతను నా కాలేజ్ మేట్. ఆ రోజు నేను చాలా ఏడ్చాను'' అని రజనీకాంత్ వివరించారు.
కింద పడిన ప్రతిసారీ ఫ్యాన్సే నిలబెట్టారు!
రజనీకాంత్ అనే చెట్టు కింద పడబోతున్న ప్రతిసారీ అభిమానులే నిలబెట్టారని సూపర్ స్టార్ అన్నారు. తాను అభిమానుల కాళ్లకు మొక్కాలని, వాళ్ళను పూజించాలని రజనీ చెప్పారు. డబ్బు, సక్సెస్ కంటే అభిమానం ముఖ్యం అని ఆయన తెలిపారు.





















