Rajendra Prasad : 'పిఠాపురంలో'... అలా మొదలైంది - పవన్ కల్యాణ్ ట్రెండింగ్ టైటిల్‌తో రాజేంద్ర ప్రసాద్ న్యూ మూవీ
Pithapuramlo Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ట్రెండ్ సృష్టించిన 'పిఠాపురం' పేరుతో మూవీ రాబోతోంది. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Rajendra Prasad's Pithapuramlo Movie To Release Soon : పిఠాపురం... గతేడాది ఎన్నికల టైంలో ఆ తర్వాత రీసెంట్‌గా ఈ పేరు ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం కాగా... 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా...' అంటూ చాలా మంది బైక్స్ వెనుక కూడా వేసుకున్నారు. ఇప్పుడు ఇదే పేరుతో ఓ మూవీ సైతం రాబోతోంది.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్
సరికొత్త ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా ఇందులో సీనియర్ హీరో, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ మూవీ 'ప్రేయసి రావే'తోనే సత్తా చాటిన మహేష్ చంద్ర ఈ మూవీకి దర్శకత్వవం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'పిఠాపురంలో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'అలా మొదలైంది' అనేది ట్యాగ్ లైన్. రాజేంద్ర ప్రసాద్‌తో పాటు పృథ్వీరాజ్, కేదార్ శంకర్, జయవాహిని, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తన కెరీర్‌లో మహేష్ చంద్ర ఎన్నో హిట్ చిత్రాలు ఇండస్ట్రీకి అందించారు. అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దుండిగల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఫ్యామిలీ ఎమోషన్ కలగలిపిన లవ్ స్టోరీ ఈ 'పిఠాపురంలో' మూవీ అని డైరెక్టర్ రవిచంద్ర తెలిపారు. 'సినిమాలో 3 జంటల ప్రేమకథలు చూడొచ్చు. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లను చూడొచ్చు. ఆడియన్స్ ఏదో ఒక రకంగా ఈ స్టోరీతో కనెక్ట్ అవుతారు. ఈ మధ్య కాలంలో పిఠాపురం ఎంతలా మార్మోగిందో అందరికీ తెలిసిందే. ఆ ఊరి నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 6 రోజులు షూటింగ్ జరిపాం.
సినిమాలో మొత్తం 3 పాటలు ఉంటాయి. గోవాలో ఓ పాట, హైదరాబాద్‌లో సెట్ వేసి మరో పాట, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజీలో మరో పాటను షూట్ చేశాం. దర్శకునిగా నాకు లైఫ్ ఇచ్చిన రామానాయుడు గారి స్ఫూర్తితో కథను నమ్మి ఎక్కడా వేస్టేజ్ లేకుండా సినిమా తీశాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.' అని చెప్పారు. ఈ మూవీకి G.C.క్రిష్ మ్యూజిక్ అందిస్తున్నారు.





















