Raajadhani Files: రెండేళ్లలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, 'రాజధాని ఫైల్స్‘ నిర్మాత ఆవేదన!
ఏపీ రాజధాని కథాంశంతో రూపొందిన చిత్రం 'రాజధాని ఫైల్స్‘. ఈ మూవీ ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Producer Kanthanneni Ravi Shankar About Raajadhani Files Movie: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ సినిమాల రచ్చ మొదలయ్యింది. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ను బేస్ చేసుకుని రూపొందించిన ‘యాత్ర 2’ థియేటర్లలో విడుదల కాగా, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ విడుదల అవుతుందో? లేదో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ చిత్రంపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కోర్టు జోక్యం నేపథ్యంలో వాయిదా పడింది.
తాజాగా ‘రాజధాని ఫైల్స్’ పేరుతో మరో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి కొడాలి నాని సహా మరికొన్ని పాత్రల్ని అనుచితంగా చిత్రీకరించారంటూ పిటిషన్ లో పేర్కొంది. హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ మూవీ విడుదల అవుతుందో? లేదో? అనే అయోమయంలో పడ్డారు మేకర్స్.
‘రాజధాని ఫైల్స్‘ మూవీతో రాజకీయాలకు సంబంధం లేదు- నిర్మాత రవిశంకర్
అమరావతిని కాదని.. వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు చాలా కాలంగా ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ నిరసనలను బేస్ చేసుకుని భాను దర్శకత్వంలో 'రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కుతోంది. తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. తమ సినిమాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తెలిపారు. కేవలం రాజధాని రైతుల సమస్యలను బేస్ చేసుకుని ఈ సినిమా తీసినట్లు చెప్పారు.
“రైతులు తమ రాజధాని కోసం స్వచ్ఛందంగా వేల ఎకరాల భూమిని ఇచ్చారు. వాళ్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయి. రైతుల ఆకాంక్షలను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా తీయాలి అనుకున్నాం. ఈ చిత్రం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. రైతుల కన్నీళ్లే మాకు కనిపించాయి. సామాజిక బాధ్యతగా ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాకు సెన్సార్ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సెన్సార్ సభ్యులు సూచించిన అన్ని మార్పులు చేశాం. ఈ సినిమాను మొదలు పెట్టి రెండేళ్లు అవుతుంది. అన్ని సమస్యలను అధిగమించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. రైతులంతా కలిసి ఈ సినిమాను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నారు.
ఫిబ్రవరి 15న 'రాజధాని ఫైల్స్‘ విడుదల
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'రాజధాని ఫైల్స్‘ సినిమాను హిమ బిందు సమర్పిస్తున్నారు. భాను దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది.
Read Also: పేరు మార్చండి, లేదంటే సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేయండి - చిక్కుల్లో మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’