Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం
'ఆస్కార్', 'ఆర్ఆర్ఆర్' ఓ తమిళ సినిమా అన్న నటి ప్రియాంక చోప్రాపై తెలుగు సినీ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. అత్యున్నత స్థానంలో ఉండీ.. ఏది తెలుగు సినిమానో, ఏది తమిళ సినిమానో తెలియదా అంటూ మండిపడుతున్నారు.
Priyanka Chopra Comments on RRR: ఒక్కోసారి చిన్న చిన్న కామెంట్లే పెద్ద వివాదాలకు దారి తీస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే గ్లోబర్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆస్కార్ ను తన ఖాతాలో వేసుకుని మీసం మెలేసిన ఆర్ఆర్ఆర్ పై ఆమె ఊహించని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఖ్యాతిని పెంచిన ఆర్ఆర్ఆర్ మూవీ ఓ తమిళ మూవీ అంటూ కామెంట్ చేసింది. ఇంకేముంది... సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై విపరీతమైన ట్రోల్స్ వస్తు్న్నాయి. ప్రస్తుతం ఈమె ఆర్ఆర్ఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న నటి ప్రియాంక చోప్రా.. స్టార్ హీరోల సరసన నటించి భారీ హిట్ లు అందుకున్నారు. 2012లో మై సిటీతో సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. 2018లో హాలీవుడ్ యాక్టర్, సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని, అక్కడే స్థిరపడ్డారు. అంతే కాదు బాలీవుడ్ ను వదిలి హాలీవుడ్ లోనే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ విషయంపైనా ఆమె ఇటీవల క్లారిటీ ఇచ్చారు. హిందీ పరిశ్రమలో రాజకీయాలు తట్టుకోలేకే బాలీవుడ్ ను వదిలిపెట్టానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓ మూలకు నెట్టేశారని, కొందరితో విభేదాలు కూడా వచ్చాయని చెప్పారు. అందుకే బ్రేక్ తీసుకోవాలనుకున్నానని స్పష్టం చేశారు. ఆమె కామెంట్స్ తో సినీ వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ వ్యా్ఖ్యలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
ఇక తాజాగా ప్రియాంక చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఆమె.. 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ను తమిళ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల నిర్వహించిన ఓ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియాంక... బాలీవుడ్ సినిమాల గురించి చెప్పే సందర్భంలో.. హిందీ పరిశ్రమ కొందరి చేతుల్లోనే ఏకీకృతమైందన్న విషయం వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలావరకు మారాయని తెలిపారు. ఈ సమయంలోనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ’ఆర్‌ఆర్‌ఆర్‘ మూవీ గురించి అడగడంతో మధ్యలో కలగజేసుకున్న ప్రియాంక.. అది బాలీవుడ్ చిత్రం కాదని, ఒక తమిళ సినిమా అని చెప్పడం అందర్నీ షాక్ కు గురి చేసింది. 'ఆర్‌ఆర్‌ఆర్‘ ఒక బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ.. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరికీ అది అవెంజర్స్ మూవీవంటిది'‘ అని పేర్కొంది.
ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ పై తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా హిందీ మూవీ అని కొందరు అంటే.. ఇప్పుడేమో ఈమె తమిళ మూవీ అంటున్నారని మండిపడుతున్నారు. తెలుగు సినిమా సముద్రాలు దాటి ఆస్కార్ ను చేరుకున్నా.. ఇంకా తెలుగు సినిమాను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. అంతే కాదు మార్చి12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ ఈవెంట్ కు ముందు రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలకు పార్టీ కూడా ఇచ్చారు. ఇంత చేసిన ప్రియాంకకు.. కనీసం ఏది తెలుగు సినిమా.. ఏది తమిళ సినిమా అనేది తెలియదా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ ట్రోలింగ్ పై ప్రియాంక ఇప్పటివరకూ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే ఏ రకమైన వివరణ ఇచ్చుకుంటారోనని తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత