Prashanth Neel: మంచి తండ్రిగా ఉండలేకపోయా, పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రమే ఇంటికెళ్లేవాడిని - ప్రశాంత్ నీల్
Salaar : ‘కేజీఎఫ్’, ‘సలార్’లాంటి రెండు ప్యాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. కానీ తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం తాను అంత గ్రేట్ కాదని రివీల్ చేశాడు.
Salaar Movie: ఒక సినిమాకు కథ రాసుకోవడం దగ్గర నుంచి దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవరకు దర్శకుడు ఎంతో ఒత్తిడికి లోనవుతాడు. దాదాపు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా విడుదలయిన తర్వాత ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా మరో టెన్షన్ ఉంటుంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మానసిక పరిస్థితి అలాగే ఉంది. ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్.. రిలీజ్‌కు చాలా ఒత్తిడికి గురవుతానని చెప్పాడు. అంతే కాకుండా తన ఒత్తిడి.. తన ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని కూడా బయటపెట్టాడు. తన కుటుంబానికి తాను ఎక్కువగా సమయాన్ని కేటాయించనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
కేజీఎఫ్ అయిపోయిన వెంటనే సలార్..
సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు మానసికంగా మాత్రమే కాకుండా శారీరికంగా కూడా ఒత్తిడికి లోనవుతారు. అలాంటి పరిస్థితిని తాను ఎలా ఎదుర్కుంటాడని ప్రశాంత్ నీల్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘శారీరకంగా చాలా ఘోరమైన ఒత్తిడి ఉంటుంది. నా పర్సనల్ లైఫ్ అనేది అంత గొప్పగా ఉండదు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు ఒప్పుకున్నాను. ఇక కేజీఎఫ్ అయిపోయిన వెంటనే సలార్‌ను ఎందుకు ప్రారంభించాను అంటే అది కేవలం నా పర్సనల్ నిర్ణయం. నా కుటుంబానికి కూడా ఈ విషయం తెలుసు. నేను నా పిల్లలకు తగినంత సమయం ఇవ్వలేకపోయాను’’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు నీల్.
ఏడ్చినప్పుడు మాత్రమే..
‘‘నేను నా పిల్లలను మూడు నెలలకు ఒకసారి కలిసేవాడిని.. అది కూడా వాళ్లు ఏడ్చినప్పుడు మాత్రమే. కానీ వెంటనే వెళ్లి వచ్చేస్తాను. కానీ అలా ఉండాలన్నది నేను తీసుకున్న నిర్ణయమే. దీనిని పెనాల్టీలాగా ఏం భావించను. ఇది ఒక పర్సనల్ ఛాయిస్ అంతే. నేను మంచి తండ్రిగా ఉండలేకపోయాను, మంచి భర్తగా ఉండలేకపోయాను, మంచి కొడుకుగా ఉండలేకపోయాను. అలాగే మంచి ఫ్రెండ్‌గా కూడా ఉండలేకపోయాను. సినిమా కోసం నేను చేసిన త్యాగాలన్ని సినిమాతోనే నాకు నెరవేరాలి’’ అంటూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు ప్రశాంత్ నీల్.
సోషల్ మీడియాలో యాక్టివ్..
‘‘కేవలం సినిమా గురించి మాత్రమే నేను ఒత్తిడి తీసుకుంటాను. నా పర్సనల్ విషయంపై ఎప్పుడూ తీసుకోను. నేను చాలామందికి బాధ్యత వహించాల్సి ఉంది. ప్రతీ దర్శకుడు ఇలాంటి ఒత్తిడికి లోనవుతాడు’’ అంటూ దర్శకుల మానసిక ఒత్తిడి గురించి తెలిపాడు ప్రశాంత్. 2010లో లిఖితా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు రయాన్ష్ నీల్, కూతురి పేరు సరయు నీల్. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే లిఖితా రెడ్డి.. తన పర్సనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ కపుల్ మధ్య జరిగే క్యూట్ మూమెంట్స్, ఫ్యామిలీ ఫోటోలు అన్నీ.. లిఖితా రెడ్డి సోషల్ మీడియాలోనే లభ్యమవుతాయి. ప్రశాంత్ నీల్ అయితే ప్యాన్ ఇండియా సినిమాలతో హిట్ కొట్టినా.. సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉంటాడు.
Also Read: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..