Prapancha Cinema Parimalam - ప్రపంచ సినిమా పరిమళం బుక్ రివ్యూ: క్లాసిక్స్‌ను కొత్తగా పరిచయం చేసిన పులగం చిన్నారాయణ
Book Review - Prapancha Cinema Parimalam: నంది పురస్కార గ్రహీత, ప్రముఖ జర్నలిస్ట్ - సినీ రచయిత పులగం చిన్నారాయణ తీసుకొచ్చిన తాజా పుస్తకం 'ప్రపంచ సినిమా పరిమళం'. ఏముందీ పుస్తకంలో!

సినిమా... ఓ అద్దం లాంటిది! ప్రేక్షకులు అందరికీ కనిపించే దృశ్యం ఒక్కటే కావచ్చు. కానీ, అర్థం మాత్రం వేరుగా ఉంటుంది. అద్దంలో మనకు కనిపించే దృశ్యం మనమే. ఒక్కోసారి సినిమా కూడా అంతే! దర్శకుడి దృక్కోణం ఏమిటనేది ఆ సంభాషణలు, దృశ్యం నుంచి మనం సంగ్రహించే భావంలో ఉంటుంది. ప్రపంచ సినిమాల్లో క్లాసిక్స్ అనదగ్గ కొన్ని మంచి సినిమాలు ప్రముఖులకు ఎలా అర్థం అయ్యాయి? ఆయా సినిమాల్లో భావం ఏమిటి? అనేది ఒక్కచోటకు తీసుకు వస్తే? అటువంటి గొప్ప ప్రయత్నం చేశారు నంది పురస్కార గ్రహీత, ప్రముఖ జర్నలిస్ట్ - సినీ రచయిత పులగం చిన్నారాయణ (Pulagam Chinnarayana). ఆయన తీసుకు వచ్చిన తాజా పుస్తకం 'ప్రపంచ సినిమా పరిమళం' (Prapancha Cinema Parimalam).
ఏమిటీ 'ప్రపంచ సినిమా పరిమళం'?
ఏముందీ పుస్తకంలో? ఏం చెప్పారేంటి?
వరల్డ్ సినిమాల్లో భావి తరాలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేసినవి కొన్ని ఉన్నాయి. దర్శక రచయితలకు మార్గదర్శిగా నిలించిన, స్ఫూర్తి ఇచ్చిన 26 సినిమాలు ఎంపిక చేసుకున్నారు పులగం చిన్నారాయణ. ఆయా సినిమాల్లో సంగ్రహించాల్సిన విషయం ఏమిటి? ఆ కథల్లో భావం ఏమిటి? అనేది సినీ ప్రముఖులతో చెప్పించారు.
Also Read: త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ
తరాలకు అతీతంగా ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా 'బెన్ హర్'. దాని గురించి పీఎస్ గోపాలకృష్ణ చెప్పింది చదువుతూ వెళతాం. 'మెర్సీ మిషన్' గురించి భాగ్య రాజా, 'టేస్ట్ ఆఫ్ చెర్రీ' గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి చెప్పిన అంశాలు ఆయా సినిమాలను మనకు కొత్త కోణంలో చూపిస్తాయి. తన సినిమాల విడుదల సమయంలోనూ మీడియా ముందు తక్కువ కనిపించే 'స్రవంతి' రవికిశోర్ ఓ సినిమా గురించి చెప్పారు. దర్శకులు శివ నాగేశ్వరరావు, రచయితలు గోపి మోహన్ - బీవీఎస్ రవి, మహ్మద్ ఖదీర్ బాబు సహా పలువురు ప్రముఖులు చేసిన విశ్లేషణలు మనల్ని మళ్ళీ ఆయా సినిమాలు చూసేలా, ఆయా కథలను లోతుగా అర్థం చేసుకునేలా 'ప్రపంచ సినిమా పరిమళం' పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సినీ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకాల్లో ఇదొకటి అని చెప్పవచ్చు. ఆక్షౌహిణి మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ప్రస్తుతం మార్కెట్టులో అందుబాటులో ఉంది. ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోనూ లభిస్తుంది. ఈ పుస్తకానికి తనికెళ్ళ భరణి ముందుమాట రాశారు.
Pulagam Chinnarayana Books: పులగం చిన్నారాయణ నుంచి సినిమాలు, సినిమాలకు సంబంధించిన అంశాలపై వచ్చిన పుస్తకాలకు పాఠకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 'జంధ్యామారుతం' నుంచి మొదలు పెడితే 'ఆనాటి ఆనవాళ్లు', 'సినీ పూర్ణోదయం', 'స్వర్ణయుగ సంగీత దర్శకులు', 'పసిడి తెర', 'సినిమా వెనుక స్టోరీలు', 'మాయాబజార్ మధుర స్మృతులు', 'వెండి చందమామలు', ఈ మధ్య వచ్చిన 'జై విఠలాచార్య', 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్' వరకు... ప్రతిదీ పాఠకుల ఆదరణ సొంతం చేసుకుంది.
Also Read: నేనూ హిచ్‌కాక్ ఫ్యాను... 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బావుందంటూ వినిపించిన మల్లాది గొంతు





















