(Source: ECI/ABP News/ABP Majha)
Pradeep Kondiparthi: ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమంటే వద్దన్నాను - రక్తంతో ప్రేమలేఖలు రాసేవారు: ‘ఎఫ్ 2’ నటుడు ప్రదీప్
Pradeep Kondiparthi: ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల్లో హీరోయిన్ తండ్రిగా చేసిన ప్రదీప్ కొండిపర్తి.. ఒకప్పుడు హీరో అని ఈతరం వారికి తెలియదు. తాజాగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Pradeep Kondiparthi: ఒకప్పుడు హీరోలుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన చాలామంది నటులు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. అందులో ప్రదీప్ కొండిపర్తి కూడా ఒకరు. అసలు ప్రదీప్ కొండిపర్తి పేరు చెప్పగానే ఈతరం ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోయినా.. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల్లో ‘అంతేగా అంతేగా’ అనే ఆర్టిస్ట్ అంటే చాలామంది గుర్తుపడతారు. అలా ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయిన ప్రదీప్.. ఒకప్పుడు మూడు క్లాసిక్ హిట్స్ అందించిన హీరో. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
19 ఏళ్లకే సినిమా..
‘ముద్దమందారం’, ‘నాలుగు స్థంభాలాట’, ‘రెండు జెళ్ల సీత’.. ఈ మూడు చిత్రాల్లో ప్రదీప్ కొండిపర్తి హీరో. ఈ మూడు సినిమాలు 100 రోజులు ఆడాయంటూ గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అసలు ఆయన ఇండస్ట్రీలోనే కనిపించలేదు. దానికి కారణమేంటో ఆయన తాజాగా బయటపెట్టారు. ‘‘నేను ఇండస్ట్రీలో సర్దుకోలేకపోయాను. కల్మషం లేకుండా మాట్లాడే నేచర్ నాది. నేను 19వ ఏట సినిమాల్లోకి వచ్చాను. 21కి వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు నాకు అంతలా మెచ్యురిటీ లేదు. అప్పుడు జంధ్యాల కూడా వచ్చి బాలచందర్, భారతీరాజా దృష్టిలో పడ్డావు, నువ్వు హీరోగా కంటిన్యూ చేయగలవు అని అన్నారు. ఒకవేళ ఇది కంటిన్యూ అవ్వకపోతే మధ్య తరగతి నుంచి వచ్చిన నేను.. ఏమైపోతానో అని భయమేసింది’’ అని చెప్పుకొచ్చారు ప్రదీప్.
మోసం చేయలేదు..
‘‘నాకు సీఏ చదవాలని కోరిక ఉండేది. గోల్డ్ మెడల్స్ తీసుకునేంత రేంజ్‌లో చదుకునేవాడిని. కాబట్టి బాగా చదువుకొని 25 ఏళ్లు వచ్చాక, మెచ్యురిటీ వచ్చాక ఇండస్ట్రీకి తిరిగొస్తే బాగుంటుందని అనుకున్నాను. అది అందరూ కాస్ట్‌లీ తప్పు అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం అలా కాదు. సినిమా ఇండస్ట్రీలో నన్ను ఎవరూ మోసం చేయలేదు. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయలేను. అలా నేను సర్దుకోలేకపోయాను. 1986 నుంచి ఇప్పటివరకు నేను రోజూ కెమెరా ముందే ఉన్నాను. అలాగే ఎన్నో పాఠాలు కూడా నేర్చుకున్నాను. అందరినీ నమ్మడం, డబ్బులు పెట్టకపోయినా పార్ట్‌నర్ అని హోదా ఇవ్వడం, నమ్మినవాళ్లే నా గురించి చెడుగా చెప్పడం.. ఇలా చాలా జరిగాయి’’ అని వివరించారు.
20 లక్షల మంది..
ప్రస్తుతం ప్రదీప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్‌తో బిజీగా ఉన్నారు. అలా తన జీవితంలో దాదాపు 20 లక్షల మందిని ప్రత్యక్షంగా ట్రైన్ చేశానని బయటపెట్టారు. పర్సనల్‌గా తనకు డైరెక్షన్ అంటే ఇష్టమని తెలిపారు. ఇక హీరోగా ఉన్నప్పుడు తనకు వచ్చిన ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిలాగా వాట్సాప్ కాకుండా అప్పట్లో ప్రేమలేఖలు ఉండేవి. రోజుకు దాదాపుగా 1000, 1500 ఉత్తరాలు ఇంటికి వచ్చేవి. రక్తంతో లేఖ రాస్తున్నాను, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను.. ఇలాంటివి చూసినప్పుడు మొదట్లో భయమేసేది. మా పెద్దన్నయ్య అన్నీ చదివేవాడు’’ అని గుర్తుచేసుకున్నారు. ఇక నటి పూర్ణిమను పెళ్లి చేసుకోమని తన తండ్రి అడిగాడని కానీ తనను ఫ్రెండ్‌లాగా చూడడంతో పెళ్లి వద్దనుకున్నానని బయటపెట్టాడు ప్రదీప్ కొండిపర్తి.
Also Read: బేబీ కోసం నరేష్ కన్నీళ్లు - సాయానికి ముందుకు వచ్చిన కల్కీ టీం