Salman Khan: 70 మందితో రెక్కీ, రూ.25 లక్షలు సుపారీ - సల్మాన్ ఖాన్ హత్యకు ఇలా ప్లాన్ చేశారట
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా జరిగిన ఫైరింగ్ కేసులో ఇప్పటికీ పోలీసుల విచారణ జరుగుతోంది. తాజాగా ఆ కేసులో 350 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు పోలీసులు. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
Salman Khan Latest News: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ఎప్పటినుండో ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకే సల్మాన్ కూడా ఎప్పటికప్పుడు తన సెక్యూరిటీని మారుస్తూ ఉంటాడు. తన సేఫ్టీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. అయినా కూడా తాజాగా సల్మాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన సంచలనంగా మారింది. ఈ కాల్పుల వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉందని పోలీసులు సైతం కన్ఫర్మ్ చేశారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఇప్పటికే అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నేవీ ముంబాయ్ పోలీసులు. తాజాగా వారు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
ఆరుగురు అరెస్ట్..
దాదాపు మూడు నెలల క్రితం.. అంటే ఏప్రిల్ 14న ముంబాయ్‌లోని సల్మాన్ నివాసమైన గ్యాలక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. దీంతో పోలీసులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటన కాసేపటికే వైరల్ అయ్యింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారని సీసీటీవీ కెమెరాలు చూస్తే తెలిసింది. వారిద్దరూ ఒక బైక్‌పై వచ్చినా కూడా ఆ బైక్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారని పోలీసులకు తెలిసింది. అది కూడా ఎక్కడో దొంగలించి తీసుకొచ్చారని వారు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు దుండగులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మెల్లగా ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
రూ.25 లక్షలు ఒప్పందం..
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు నిందితుల్లో ఒకడైన అనుజ్ థామస్ అనే వ్యక్తి.. మే 1న లాకప్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులు చెప్పినదాని ప్రకారం.. లారెన్స్ బిష్నోయ్ తన గ్యాంగ్‌తో కలిసి సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా ప్లాన్ చేశాడట. దీంతో ఆ అయిదుగురిపై 350 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు పోలీసులు. హత్యకు కుట్ర చేశారని కేసులు నమోదు చేశారు. వీరంతా రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి వారు ఒప్పుకున్నారని, దీనికోసం దాదాపు ఏడాది పాటు ప్రణాళిక చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కోసం అడ్వాన్స్ ఆయుధాలను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేయాలని కూడా నిందితులు ప్లాన్ చేశారట.
అదే ఫిస్టల్..
సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఉపయోగించిన ‘జిగానా పిస్టల్’ను సల్మాన్ ఖాన్ హత్య కోసం తెప్పించాలని లారెన్స్ బిష్నోయ్ అనుకున్నాడని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు తెలిపారు. సల్మాన్ ఖాన్ వెళ్లే దాదాపు ప్రతీ చోటులో బిష్నోయ్‌కు చెందిన 70 మంది రెక్కీ నిర్వహించారట. దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ తరహాలో సల్మాన్ హత్య కోసం 18 ఏళ్ల లోపు ఉన్న టీనేజర్లను సిద్ధం చేశారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. వారంతా లారెన్స్ బిష్నోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూశారని, హత్య చేసిన వెంటనే కన్యాకుమారి నుంచి శ్రీలంకకు పారిపోయేలా ప్లాన్ సిద్ధమని అందులో పేర్కొన్నారు. దీంతో లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.
Also Read: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా