Ustaad Bhagat Singh: గ్లాసంటే సైజ్ కాదు, సైన్యం - పగిలేకొద్ది పదునెక్కుద్ది, పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్లేజ్ అదుర్స్!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. మీరూ చూసేయండి.
Ustad Bhagat Sing Teaser: ఎన్నో రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మంగళవారం విజువల్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. భగత్‌సింగ్ బ్లేజ్ అంటూ.. వదిలిన వీడియోకు విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్.
నరసింహ స్వామివారి రథయాత్రతో టీజర్ మొదలైంది. రథాన్ని లాగుతున్న భక్తులు, పూజారులపై రౌడీలు దాడి చేసే సీన్ తర్వాత పవన్ కల్యాణ్ ఎంట్రీని చూపించారు. ‘‘నీ రేంజ్ ఇది అంటూ.. విలన్ టీ గ్లాస్ చూపిస్తూ.. దాన్ని కిందపడేసి పగలగొడతాడు. అప్పుడే.. పవన్ కల్యాణ్ మాస్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. ‘‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’’ అంటూ విలన్ పీక కోస్తాడు. ‘‘కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాసంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం’’ డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్‌తో టీజర్ ఎండ్ అయ్యింది. ఇక పిక్చరైజేషన్ అయితే.. ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించడం ఖాయం. ప్రస్తుత పొలిటికల్ సిట్యూవేషన్‌కు తగినట్లుగా పవర్ స్టార్ డైలాగ్స్ ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి భగత్స్ బ్లేజ్‌ను ఇక్కడ చూడండి:
టీజర్ కాదు.. బ్లేజ్ మాత్రమే:
వాస్తవానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి గ్లింప్స్ ఎప్పుడో వచ్చేసింది. దీంతో అంతా ఈసారి వచ్చేది టీజర్ అని అనుకున్నారు. కానీ.. ఒక్క నిమిషం నిడివి గల ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో వీడియోను వదిలారు. ఇది కొంచెం ఫ్యాన్స్.. నిరుత్సాహాన్ని కలిగించే విషయమే. కానీ, అసలు కన్నా కొసరు మేలు అన్నట్లు.. ఏదో ఒక అప్‌డేట్ వచ్చింది కదా అని సరిపెట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ నుంచి ఈ అప్‌డేట్ రావడం చర్చనీయంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పవర్ స్టార్ బిజీగా తిరుగుతారని, ఇక ఆయన అప్‌డేట్స్ రావడం కష్టమే అని అనుకుంటున్న సమయంలో హరీష్ శంకర్.. ‘‘మీరు ఊహించనిది జరగబోతుంది.. మార్చి 19న’’ అంటూ అప్‌డేట్ ఇచ్చారు. అంతే, ఆ రోజు నుంచి అభిమానులు అప్‌డేట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అదిరిపోయే అప్‌డేట్‌తో వచ్చి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. అంతేకాదు.. టీజర్, ట్రైలర్‌లు కూడా ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధమంటున్నారు.
హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెలిసిందే. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇందులో కూడా పవన్ కల్యాణ్ పోలీస్ గెటప్‌లోనే కనిపిస్తున్నారు. పవర్ స్టార్ సరసన శ్రీలీల నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై.రవి శంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ మూవీ నిర్మాణ దశలోనే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన సినిమాలన్నీ ఆలస్యమవుతున్న సంగతి తెలిసింది.