Bro Movie: బుల్లితెరపై ‘బ్రో’ సందడి - 54 అడుగుల పవన్ కళ్యాణ్ కటౌట్ ఆవిష్కరిస్తున్న ఆ టీవీ చానెల్
బుల్లితెరపై ‘బ్రో’ మూవీ అలరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మునుపెన్నడూ లేని ఒక సూపర్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసింది జీ తెలుగు.
తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలో విడుదల అవుతుందంటే చాలు.. థియేటర్ మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. ఈలలు, గోలలు, టపాసులు.. వీటన్నింటితో సెలబ్రేట్ చేయడం అభిమానులు కామన్. అయితే ఇవన్నీ ఉన్నా.. లేకపోయినా ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదే హీరో కట్ ఔట్. స్టార్ హీరోల సినిమా విడుదల ఉందంటే చాలు.. ప్రతీ థియేటర్ దగ్గర హీరోల కట్ ఔట్స్ ప్రత్యక్షమవుతాయి. ఎవరి కట్ ఔట్ పెద్దది అని పోటీ కూడా జరుగుతుంది. అయితే వీటన్నింటికి భిన్నంగా మొదటిసారి ఒక మూవీ టీవీ ప్రీమియర్ కోసం హీరో కట్ ఔట్‌ను ఆవిష్కరించడం ఆశ్చర్యపరుస్తోంది.
థియేటర్లలో సూపర్ సక్సెస్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్యకాలంలో ఆయన తెరకెక్కించే సినిమాలు సైతం ఆయన ఫ్యాన్స్‌ను సంతోషపెట్టేలాగానే ఉన్నాయి. ఆ సినిమాల్లో ఆయన డైలాగులు.. నేరుగా ఆయన ఫ్యాన్స్‌తో మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. దీనికి ఉదాహరణే తాజాగా విడుదలయిన ‘బ్రో’. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. దేవుడి పాత్రలో కనిపించారు. ఇక ఆయన చెప్పే డైలాగులకు థియేటర్‌లో ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ మూవీ థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు బుల్లితెరపైకి రానుంది.
ఆవిష్కరణ వేడుక..
‘బ్రో’ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ మూవీ జీ తెలుగులో ప్రీమియర్ కానుంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా జీ తెలుగు ఒక కొత్త ప్లాన్ వేసింది. ‘బ్రో’ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54 అడుగుల కట్ ఔట్‌ను ఆవిష్కరించనుంది. అయితే ఈ ఆవిష్కరణ వేడుకకు అందరూ ఆహ్వానితులే అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఒక సినిమా టీవీ ప్రీమియర్ కోసం ఒక ఛానెల్.. ఇలాంటి ఈవెంట్‌ను ప్లాన్ చేయడం కొత్తగా ఉంది అంటూ మూవీ లవర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
‘వినోదాయ సితం’ రీమేక్‌గా..
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సితం’ అనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసి ‘బ్రో’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళంలో ఒరిజినల్ వర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని.. ‘బ్రో’ను కూడా డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. జులై 28న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాగా.. ఓపెనింగ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ ముందు సినిమాలకంటే ‘బ్రో’ మెరుగ్గా ఆడిందని ఇండస్ట్రీ నిపుణులు తెలిపారు. కలెక్షన్స్ ఎలా ఉన్నా కూడా థియేటర్లలో విడుదలయిన నెలరోజులకే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది ‘బ్రో’. ఇక ఇప్పుడు ఏకంగా అందరి టీవీల్లోకే రానుంది. ఇక ‘బ్రో’ సక్సెస్‌తో తన తరువాతి సినిమాలపై పవన్ ఫోకస్ చేస్తాడు అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. ప్రస్తుతం పవర్ స్టార్ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
Also Read: బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial