Oscar 2023: ‘ఆస్కార్’ అవార్డు అంత చవకా? ట్రోఫీని ఏ లోహంతో చేస్తారు? ఖరీదు ఎంత?
ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్. ఇంతకీ దానికి ఆపేరు ఎలా వచ్చింది? ఎవరు రూపొందించారు? ఒక్కో అవార్డు తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్కార్(Oscar).. ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డు. సినీ రంగంలో అత్యంత ప్రతిభావంతులకు ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎంతో వడపోత తర్వాత ఆయా చిత్రాలకు నామినేషన్ ఇస్తారు. 2023 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మరికొద్ది గంటల్లో జరగనున్న నేపథ్యంలో, ఈ అవార్డు ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? ఒక్కో అవార్డు తయారీకి ఎంత సమయం తీసుకుంటారు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్కార్(Oscar)కు ఆ పేరు ఎలా వచ్చింది?
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ఈ ఆస్కార్ అవార్డులను అందిస్తోంది. తొలినాళ్లలో ఈ సంస్ధ ప్రదానం చేసే ఈ ట్రోఫిని అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ గా పిలిచేవారు. ఆ తర్వాత కొంత కాలానికి దీని పేరు ఆస్కార్ గా మారింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది? అనే విషయాన్ని పరిశీలిస్తే, ఆ రోజుల్లో అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న మార్గరెట్ హెర్రిక్, ఆ ట్రోఫీని చూస్తుంటే తన అంకుల్‌ని చూస్తున్నట్టే ఉందని చెప్పారట. అదే సమయంలో ఓ హాలీవుడ్ కాలమిస్ట్ తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్ గా పిలిచారట. ఆ సమయంలోనే అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ కాస్త ఆస్కార్ గా మారిపోయింది.
ఆస్కార్ అవార్డును ఎలా తయారు చేస్తారంటే?
ఆస్కార్ అవార్డు చూడటానికి పసిడి వర్ణంలో మెరిసిపోతుంటుంది. దీన్ని చూడగానే ఈ అవార్డును బంగారంతో చేస్తారని అందరూ భావిస్తారు. కానీ, ఆస్కార్ ట్రోఫీలో ఉండేదంతా బంగారం కాదు. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారం పూత పూస్తారు. ఈ ట్రోఫీ పదమూడున్నర అంగుళాల ఎత్తు ఉంటుంది. సుమారు 4 కేజీల బరువు ఉంటుంది. ఈ అవార్డుకు ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలకు గుర్తుగా ఈ స్పోక్స్ ఏర్పాటు చేశారు.
ఆ అవార్డు ప్రతిమ కోసం నగ్నంగా నిలబడ్డ నటుడు
ఈ అవార్డు సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్. ఈ అవార్డు ప్రతిమను తయారు చేసే సమయంలో నటుడు ఎమిలో ఫెర్నాండెజ్‌ను నగ్నంగా నిలబెట్టారట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. అంతేకాదు, ఈ అవార్డు తయారీకి చాలా సమయం పడుతుంది. 50 ఆస్కార్ ట్రోఫీలు తయారు చేయడానికి సుమారు 3 నెలల సమయం పడుతుందట. ఇక ఈ అవార్డు విలువను అధికారికంగా 1 డాలర్ గా నిర్ణయించింది అవార్డు సంస్థ. ఎందుకంటే, ఆస్కార్ అవార్డు ప్రతిమను విక్రయించకుండా ఉండేలా తక్కువ ధరను నిర్ణయించింది. గతంలో దీని విలువ 10 డాలర్లుగా ఉండగా ఇప్పుడు దాని ధర 1 డాలర్ గా ఉంది. నిజానికి ఆస్కార్ అవార్డు తయారీకి ఏకంగా 400 డాలర్ల ఖర్చు అవుతుంది.
1929లో తొలిసారి అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం
తొలిసారి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లోని హోటల్ రూజ్వెల్ట్‌లో జరిగింది. సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి ఈ అవార్డులను ఏర్పాటు చేశారు. తొలి వేడుకలో 270కిపైగా అతిథులు పాల్గొన్నారు.
Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్