News
News
X

Oscars 2023 Rajamouli : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే

భారతీయ సినిమా చరిత్ర ఉన్నంత వరకు రాజమౌళిని ప్రేక్షకులు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు. పెట్టుకోవాలి కూడా. ఇండియాకు ఆస్కార్ తెచ్చిన ఘనత ఆయనదే మరి.

FOLLOW US: 
Share:

ప్రపంచ సినిమా పెద్దన్నగా 'హాలీవుడ్' గురించి చెబుతుంటారు. మరి, అవార్డుల్లో? పెద్దన్న ఆస్కారే! ఒక భాష, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అందరికీ తెలిసిన అవార్డులలో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్'ది అగ్ర తాంబూలం. అటువంటి అవార్డుల్లో పెద్దన్న హాలీవుడ్ మెజారిటీ అవార్డులను గెలుచుకుని, తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా జరుగుతున్నది అదే. ఆ అవార్డుల్లో మన తెలుగు సినిమాకు చోటు ఉంటుందా? ఎవరూ కలలోనూ ఊహించని అంశం. ఆ కలను సాకారం చేసిన వ్యక్తి? దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.

భవిష్యత్ తరాలకు దారి చూపిన రాజమౌళి
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) సినిమాతో భావి తరాలు ఆస్కార్ మీద ఆశలు కలిగించిన వ్యక్తి రాజమౌళి. ఆస్కార్ కలలు కనే ధైర్యం చేయవచ్చని భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి. తెలుగు సినిమా అంటే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మాత్రమే పోటీ పడుతుందని ఆలోచించే వ్యక్తులకు పాటలతో మనం పోటీ పడవచ్చని దారి వేసిన వ్యక్తి రాజమౌళి.

ఎన్ని అనుమానాలు... అవమానాలు!?
ఇప్పుడు 'నాటు నాటు...'కు అవార్డు రావడంతో 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని, ఆ పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, సంగీతం అందించిన ఎంఎం కీరవాణి, సినిమా తీసిన ఎస్ఎస్ రాజమౌళి మీద ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి... 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' పాటకు అవార్డు రావడానికి ముందు ఎన్ని అనుమానాలు నెలకొన్నాయి?

విడుదలకు ముందు తిట్టిన నోటి నుంచి పొగడ్తలు వస్తున్నాయి. ఉదాహరణకు... 'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీం పాత్రధారి ముస్లిం టోపీ ధరించడం ఏంటి? అని బీజేపీ తెలంగాణ నేత బండి సంజయ్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. సినిమా విడుదలైతే థియేటర్లు తగలబెడతామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆయన చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ అవార్డుల కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు పోసి అవార్డులను కొంటుందని విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఆ విమర్శలను పక్కన పెట్టి ప్రశంసిస్తున్నారు.

ఇదంతా రాజమౌళి చలవే!
ఇప్పుడు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నా... హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫారిన్ ప్రేక్షకులకు తెలిసినా... ఆస్కార్ స్టేజి మీద కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడినా... ఇదంతా రాజమౌళి చలవే. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో ఇండియా నుంచి అధికారికంగా 'ఆర్ఆర్ఆర్'ను పంపిస్తారని అందరూ ఆశించారు. అయితే... ఈ సినిమాను కాదని గుజరాతీ సినిమా 'చెల్లో షో'ను జ్యూరీ సెలెక్ట్ చేసింది. అప్పుడు వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. 'ఆర్ఆర్ఆర్'ను పంపించకపోవడం ఏమిటని అభిమానులు ప్రశ్నిస్తే... ఉత్తరాది ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. 'ఆర్ఆర్ఆర్' కమర్షియల్ సినిమా అని కామెంట్ చేశారు. ఆ విమర్శలకు రాజమౌళి తల వంచలేదు. 

ఇండియా నుంచి ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో నామినేషన్ రాదని తెలిసి దర్శక ధీరుడు దిగాలు పడలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆస్కార్ దారి ఎక్కడ ఉంది? ఎటు నుంచి ఉంది? అని అన్వేషణ చేశారు. ఆస్కార్ ముందు గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, ఇంకా పలు అవార్డులకు సినిమాను పంపించారు. లెజెండరీ హాలీవుడ్ దర్శకులకు సినిమా చేరువ అయ్యేలా చేశారు. 'ఆర్ఆర్ఆర్' గురించి తెలిసేలా చేశారు. ఆయన కృషికి దక్కిన ఫలితమే ఈ ఆస్కార్ అవార్డు. 

రాజమౌళీ... చరిత్ర నిన్ను గుర్తు పెట్టుకుంటుంది!
ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే అనుకునే ఫారినర్లకు తెలుగు సినిమా అనేది ఒకటుందని తెలిసేలా చేశారు రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' తెలుగు సినిమా అని ప్రపంచ సినిమా వేదికలపై చెప్పారు. తెలుగు చిత్రసీమకు గౌరవం, గుర్తింపు తీసుకొచ్చారు. ఇక నుంచి ఆస్కార్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ రాజమౌళి పేరును భారతీయ చిత్రసీమ చెప్పుకోవాలి. 

'నాటు నాటు' కంటే ముందు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన 'జయహో' పాట ఆస్కార్ అందుకుంది. అయితే, అది తెలుగు సినిమాలో పాట కాదు, డానీ బోయెల్ అని హాలీవుడ్ దర్శకుడు తీసిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాలోనిది. ఆ సినిమాకు మలయాళీ రసూల్ పూకుట్టి కూడా ఆస్కార్ అందుకున్నారు. వాళ్ళ కంటే ముందు కొంత మంది భారతీయులు ఆస్కార్ అందుకున్నారు. అవన్నీ హాలీవుడ్ సినిమాలకు వచ్చినవి. మొదటిసారి ఓ భారతీయ కమర్షియల్ సినిమా ఆస్కార్ అందుకోవడం 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...'తో మొదలు అని చెప్పాలి.

Also Read : ఎన్టీఆర్ షేర్వాణీపై పులి బొమ్మ వెనుక సీక్రెట్ - 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై కామెంట్

ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ సినిమాలో పాటగా, తెలుగు పాటగా 'నాటు నాటు...' చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆస్కార్ అవార్డ్స్ ఉన్నన్ని రోజులూ, భవిష్యత్తులో భారతీయ సినిమాలు ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రతిసారీ 'నాటు నాటు'ను గుర్తు చేసుకోవాలి. ఆ పాటతో పాటు రాజమౌళి కృషిని మెచ్చుకోవాలి. ఆస్కార్ పురస్కారాల్లో భారతీయ సినిమా ప్రయాణం రాజమౌళితో మొదలైంది. చరిత్ర ఎప్పటికీ ఆయన్ను మరువదు. గుర్తు పెట్టుకుంటుంది. 

'నాటు నాటు'కు ఆస్కార్ - ఇది చరిత్ర కాదు... చరిత్రకు పునాది వేసిన పురస్కారం. సరికొత్త చరిత్రకు నాంది పలికిన తరుణం. భవిష్యత్తులో ఎన్ని ఆస్కార్ అవార్డులు అయినా రావచ్చు. అయితే, ఎప్పుడూ మొదటిది ప్రత్యేకమే కదా... ఇదీ అంతే! మన దేశానికి ఈ అవార్డు ఎంతో ప్రత్యేకం. 

Also Read : ఆస్కార్ కొట్టినా బాలీవుడ్ సాంగ్ అంటారేంటి? తెలుగు వచ్చిందని జిమ్మీకి ఎవరైనా చెప్పండయ్యా

Published at : 13 Mar 2023 12:50 PM (IST) Tags: RRR SS Rajamouli Naatu Naatu Song Naatu Naatu Oscar 2023 Oscar Awards 2023 Oscar 2023 Winners List Oscar Awards Ceremony Live Oscar 2023 Live Oscar Awards 2023 Live Oscar Live Streaming Oscar Nominations 2023 List Academy Awards 2023 Oscar Awards Ceremony Oscar 2023 Winners Full List Rajamouli Oscar

సంబంధిత కథనాలు

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

టాప్ స్టోరీస్

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం