NTR - Bandi Sanjay : అప్పుడు తిట్టారు - ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన చేతులు కట్టారు
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అదే ఎన్టీఆర్‌తో బండి సంజయ్ షేక్ హ్యాండ్. ఎందుకంటే... గతంలో బండి సంజయ్ చేసిన కామెంట్లను ఫ్యాన్స్ మర్చిపోలేదు మరి!
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన అమిత్ షా (Amit Shah) తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Rama Rao Jr) సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ భేటీలో ఇద్దరి మధ్య రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చాయా? లేదంటే సినిమాల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు. ఊహాగానాలు చాలా అంటే చాలా వినిపిస్తున్నాయి. వాటిని పక్కన పెడితే... ఈ సమావేశంలో మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అదే ఎన్టీఆర్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ షేక్ హ్యాండ్. ఎందుకంటే... గతంలో ఆయన చేసిన కామెంట్స్ అటువంటివి మరి.
కొమురం భీం... బండి సంజయ్ తిట్లను ఫ్యాన్స్ మర్చిపోలేదు!
ఇప్పుడు ఎన్టీఆర్‌ను అమిత్ షా ఎందుకు కలిశారు? పైకి చెబుతున్న కారణం అయితే... 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) సినిమాలో తారక్ నటన కమల దళపతికి నచ్చిందని! కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని కమలం పార్టీ నాయకులు, శ్రేణులు చెబుతున్నారు. కట్ చేస్తే... ఎన్టీఆర్ అభిమానులకు ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి కొమురం భీం ముస్లిం టోపీ పెట్టుకున్న స్టిల్ విడుదల చేసినప్పుడు బండి సంజయ్ పబ్లిక్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు.
థియేటర్లు తగలబెడతామని అనలేదూ!
'ఆర్ఆర్ఆర్' నుంచి ఎన్టీఆర్ స్టిల్ విడుదలైనప్పుడు బండి సంజయ్ తీవ్ర స్వరంతో చిత్ర బృందాన్ని హెచ్చరించారు. కొమురం భీంను కించపరిచేలా రాజమౌళి సినిమా తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు... దర్శక ధీరుడికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. నిజాం ఫొటోకు కాషాయం జెండా వేసి సినిమా తీసే ధైర్యం రాజమౌళికి ఉందా? అని ప్రశ్నించారు. 'ఆర్ఆర్ఆర్' విడుదల చేస్తే థియేటర్లు తగలబెడతామని అన్నారు.
''బిడ్డా... నువ్వు గనక సినిమా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే? కొమురం భీంను కించపరిచే విధంగా, ఆదివాసీల హక్కులను కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు గాయపడే విధంగా సినిమా తీస్తున్నావ్. సినిమా రిలీజ్ చేస్తే బరిసెలతో కొట్టి తరిమికొడతాం'' అని రాజమౌళికి బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. హిందువుల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీపై మతతత్వ పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారని ఆయన అన్నారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
అప్పుడు తిట్టి... ఇప్పుడు పొగడ్తలా?
'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీం వేషధారణపై గతంలో విమర్శలు చేసిన బండి సంజయ్... ఇప్పుడు ఎన్టీఆర్‌ను కలిశానంటూ ట్వీట్ చేయడం, అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయినప్పుడు ఆయన పక్కన ఉండి వీడియో, ఫోటోల్లో కనిపించడం కోసం ప్రయత్నించడం చూసి యంగ్ టైగర్ ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వాళ్ళకు గుర్తు వస్తున్నాయి. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో ఆ వీడియోలు షేర్ చేస్తున్నారు.
Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?
అమిత్ షాకు ఎన్టీఆర్ అభినయం నచ్చడంతో బండి సంజయ్ కూడా 'ఆహా ఓహో' అంటున్నారని ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు తిట్టి... ఇప్పుడు నవ్వుతూ ఎన్టీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అదీ సంగతి!
Met accomplished actor of Indian Cinema Shri @tarak9999 garu who called upon Hon'ble Union Minister Shri @AmitShah ji at Novotel. pic.twitter.com/gbhGh8BtHS
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 21, 2022