(Source: Poll of Polls)
NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
NTR, A Star Who Became God - Sr NTR Birthday : నందమూరి తారక రామారావును కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా కంటే దేవుడిగా చూసే తెలుగు ప్రజలు ఎక్కువ మంది! ఆయన్ను దైవాంశ సంభూతునిగా చూస్తారు. ఎందుకు?
నందమూరి తారక రామారావు వెండితెరపై తిరుగులేని కథానాయకుడు. తెలుగు రాజకీయాల్లో ఎదురు లేని నాయకుడు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు. తెలుగు ప్రజలు చూసిన రాముడు ఆయనే. కృష్ణుడూ ఆయనే. తెలుగు గడ్డపై పుట్టిన చాలా మందికి తెలిసిన దేవుడు ఎన్టీఆరే. ఆయన్ను దైవాంశ సంభూతునిగా చూసే ప్రజలు ఎంతో మంది. ఎన్టీ రామారావును కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, తెరపై దేవుడిగా కంటే నిజ జీవితంలోనూ తమ దైవంగా జనాలు ఎందుకు కొలుస్తున్నారు? అందుకు కారణాలు ఏమిటి? అని చూస్తే...
యుగాలు గడిచినా, తరాలు మారినా... మానవ జాతి మనుగడకు ముఖ్యమైన, మన ఉన్నతికి కారణమైన ఆదర్శాలను అందరికీ ఇచ్చి వెళ్లే వ్యక్తులను దేవుళ్లుగా చూస్తారు. ఆ విషయంలో ఆసేతు హిమాచలం అంత ఎత్తుకు ఎదిగిన మనిషి ఎన్టీఆర్.
ఎన్టీఆర్... ఇది మూడు అక్షరాల పేరు కాదు! తెలుగుజాతి మరువలేని గుర్తు! ఆ గుర్తు ఎప్పుడూ గగనమంత ఎత్తులో ఉంటుంది. తెలుగు జాతి కొలుస్తూ ఉంటుంది. వ్యక్తిగా, వెండితెర వేల్పుగా, ముఖ్యమంత్రిగా ఆయన ఆచరించిన విలువలే చాలా మందిలో దేవుణ్ణి చేశాయి. సగటు మనిషికి ఆదర్శప్రాయంగా నిలిచాయి. అవి ఏమిటి? అనేది చూస్తే...
మర్యాదా పురుషోత్తముడు... నందమూరి తారక రాముడు!
శ్రీరాముడిని మర్యాదా పురుషోత్తముడు అంటారు! తల్లిదండ్రులకు, పెద్దలను గౌరవించారు కనుక! రాజ్యాన్ని ఎలా పాలించాలో ఆచరణలో చూపించారు కనుక! తెలుగు ప్రజలు చూసిన రాముడు నందమూరి తారక రాముడే. పెద్దలను, తన కంటే చిన్నవాళ్ళనూ రామారావు ఎప్పుడూ తక్కువగా చూసింది లేదు. పెద్దలకు ఎంత గౌరవం ఇచ్చేవారో... తనకంటే చిన్నవాళ్ళను 'బ్రదర్' అంటూ అంతే ఆప్యాయంగా చూసుకున్నారు.
ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేశారంటే... ప్రజలను ఎలా పాలించాలో ఆయన చేతల్లో చూపించినట్టే కదా!
ఎన్టీఆర్ జీవితం... గొప్ప వ్యక్తిత్వ పాఠం!
ఇప్పుడు వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎక్కువ మంది కనపడుతున్నారు. జీవితంలో ఎలా ఉండాలో? ఏం చేయాలో? చెబుతున్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే... అంత కంటే మించిన గొప్ప వ్యక్తిత్వ పాఠం ఉండదు.
ప్రతిరోజూ ఉదయం నిద్రలేస్తే... బోలెడు పనులు అవుతాయని, మన దగ్గర బోల్డంత టైమ్ ఉంటుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతారు. జీవితాంతం ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వ్యక్తి ఎన్టీఆర్. ఏదైనా సరే చెప్పడం కంటే చేతల్లో చూపించే వ్యక్తి ఆయన. పిల్లలను క్రమశిక్షణతో ఎలా పెంచాలి? కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి? ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి? వంటివి అన్నీ చేతల్లో చూపించారు.
ఆర్థిక క్రమశిక్షణలోనూ మేటి... అవినీతిని సహించని వ్యక్తి!
ఎన్టీఆర్ అంటే ఆర్థిక క్రమశిక్షణ కూడా! దుబారా ఖర్చులకు ఆయన వ్యతిరేకం. డబ్బు ఎక్కువ వస్తుందని ఎక్కువ ఖర్చు చేయడాన్ని కూడా సహించరు. ఓసారి పిల్లలు షాపింగుకు వెళితే ఆయన డబ్బులు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ బిల్ అయ్యింది. మళ్ళీ ఇస్తామని షాపు యజమానికి చెప్పి దుస్తులు తీసుకొస్తే... మీకు ఇచ్చిన డబ్బులకు సరిపడావి తీసుకోమని, మిగతావి ఇచ్చేయమని ఎన్టీఆర్ చెప్పారట. నిర్మాత అశ్వినీదత్ సైతం ముందుగా అనుకున్న పారితోషికం కంటే ఎక్కువ ఇస్తే... మిగతావి వెనక్కి ఇచ్చేశారు. తనది కాని రూపాయి మీద ఎప్పుడూ ఆయన ఆశ పడలేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అవినీతికి పాల్పడిన అధికారులు, నాయకులను ఇంటికి పంపేశారు. అదీ ఎన్టీఆర్! కష్టపడి సంపాదించాలనే సందేశాన్ని వ్యక్తిత్వం ద్వారా ఇచ్చారు.
గుణంలోనూ గొప్పోడు... మనసున్న మంచోడు!
సాటి మనిషికి సాయం చేసే గుణం కంటే గొప్ప మానవత్వం ఏముంటుంది? సినీ ఇండస్ట్రీని ఏకతాటిపైకి తీసుకు వచ్చారు. వరదలు వస్తే ప్రజల కోసం జోలె పట్టారు. ఎదుటి వ్యక్తికి సాయం చేయడం ఎన్టీఆర్ అలవాటు. అలాగని, వాళ్లను తక్కువ చేయడం ఆయన వ్యక్తిత్వంలో ఎప్పుడూ లేదు. తాను మార్గదర్శిగా భావించే కేవీ రెడ్డి కుమారుడు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి డబ్బు అవసరమైంది. అడగ్గానే 40 వేలు ఇచ్చారు. దర్శకుడిగా సినిమా చేసి పెడతానని, అందుకు ఓకే అంటేనే డబ్బులు ఇవ్వమని కేవీ రెడ్డి కండిషన్ పెట్టారు. అందుకు ఎన్టీఆర్ సరేనన్నారు. ఇవి పైకి తెలిసినవి మాత్రమే. ఇటువంటివి ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన గుప్తదానాలు కూడా ఉన్నాయి. అయితే, ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. ఆయనది అంత మంచి మనసు.
విశ్వమంత వ్యాపించిన ఎన్టీఆర్ జీవితంలో ఇవి అణువంత ఉదాహరణలు మాత్రమే. వ్యక్తిగా, కథానాయకుడిగా, రాజకీయ నేతగా ప్రతి అడుగులో ప్రజలపై ప్రభావం చూపించిన మనిషిని మహోన్నతుడిగా కొలవడంలో అర్థం ఉందిగా!
Also Read : ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!