‘RRR’ కంటే ముందే, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న మన తెలుగు సినిమాలివే
‘ఆర్ఆర్ఆర్’ మూవీతో తెలుగు సినిమాల కీర్తి ఎల్లలు దాటింది. ‘ఆస్కార్’ పురస్కారంతో ఔరా అనిపించింది. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే కొన్ని తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అవి ఇవే.
తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రస్తుతం క్లౌడ్ నైన్ లో ఉన్నారని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రాజమౌళి చెక్కిన RRR సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ వేదికగా కాలరెగరేసింది. టాలీవుడ్ ప్రభ ఒక్కసారిగా ప్రపంచ సినిమాపై మెరిసింది. అయితే ఇలా టాలీవుడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడం ఇదే తొలిసారి కాదు.
1950 ల్లోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన " మల్లీశ్వరి"
రఘుపతి వెంకయ్య నాయుుడు చేతుల్లో పుట్టిన తెలుగు సినిమా 1931 నాటికి HM రెడ్డి వద్ద మాటలు నేర్చింది.భక్త ప్రహ్లాద పేరుతో విడుదలైన ఆ సినిమా తరువాత ఎందరో దిగ్గజాలు సినీరంగం వైపు వచ్చేలా స్ఫూర్తినిచ్చింది. వారిలో ఒకరైన BN రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సినిమానే మల్లీశ్వరి. 1951 లో రిలీజైన ఆ సినిమా నాటి రికార్డులను బద్దలు కొట్టడమే కాక..విమర్శకుల మార్కులు కొట్టేసింది.దానితో 1953 లో బీజింగ్ లో చైనీస్ సబ్ టైటిళ్ళ తో రిలీజ్ అయింది . ఆరోజుల్లో ఒక తెలుగు సినిమా చైనా లో 13 ప్రింట్లతో షోస్ పడడం అనేది ఊహకు కూడా అందని విశేషం. అంతే కాదు అదే సినిమా 16mm తెర మీద అమెరికా లో కూడా ప్రదర్శించ బడింది . ఆ తరువాత 1957 లో రిలీజ్ అయిన మాయా బజార్ IBN వాళ్ళు 2013లో నిర్వహించిన పోల్ లో భారత దేశపు అతి గొప్ప చిత్రాల్లో మొదటి స్థానం లో నిలిచింది.
అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్ గెలుపొందిన SV రంగారావు
1963 లో రిలీజైన నర్తనశాల సినిమా ఎంత పెద్ద హిట్ అంటే.. బెంగాలీ..ఒడియా భాషల్లోకి సైతం డబ్ అయింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఇండోనేషియా లో జరిగిన ఆఫ్రో_ ఏషియన్ ఫెస్టివల్ లో రెండు అవార్డులను పొందింది. ఆ సినిమా లో కీచకుడు పాత్ర పోషించిన విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కు ఉత్తమ నటుడు అవార్డు లభిస్తే..ఆర్ట్ డైరెక్టర్ TVS శర్మ కు ఆ విభాగం లో అవార్డ్ వచ్చింది.
అప్పట్లోనే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో NTR, ANR సినిమాలు
అంతకు మూడేళ్ల ముందు 1960 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆదుర్తి వారి సినిమా ‘నమ్మినబంటు’ను స్పెయిన్ లో జరిగిన సాన్- సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అలాగే 1967 లో రిలీజైన NTR సినిమా ఉమ్మడి కుటుంబం ను భారత దేశం తరపున మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారిక ఎంట్రీ గా పంపారు.ఇక 1968 లో అయితే అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన క్లాసిక్ సుడిగుండాలు..బాపు తొలిసారి దర్శకత్వం వహించిన కృష్ణ నటించిన సాక్షి సినిమాలను తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో షో లు వేశారు.బాపు దర్శత్వంలోనే 1976 వచ్చిన సీతా కళ్యాణం సినిమాను లండన్ ఫిల్మ్ ఫెస్టివల్..చికాగో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించడం తో పాటు బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక పాఠం గా కూడా పెట్టారు.
అమెరికా, స్విట్జర్లాండ్ ప్రశంసలు పొందిన RGV క్షణక్షణం
‘శివ’ లాంటి ఇండస్ట్రీ హిట్ తో వెలుగు లోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ తో నిర్మించిన ‘క్షణక్షణం’ ఒక కల్ట్ క్లాసిక్ అయింది. ఈ సినిమాను హిందీ లోకి ‘హైరానా’ పేరుతో డబ్ చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా..క్లియర్ కట్ రోడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అమెరికా లోని మిచెగన్ రాష్ట్రం లో జరిగే ANN -ARBOR ఫిల్మ్ ఫెస్టివల్ , స్విట్జర్లాండ్ లో జరిగే FRIBOURG ఫిల్మ్ ఫెస్టివల్ ప్రశంసలు పొందింది. ఇవి మాత్రమే కాకుండా శేఖర్ కమ్ముల డాలర్ ‘డ్రీమ్స్’, నగేష్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, 2006లో రజనేష్ దోమలపల్లి డైరెక్షన్ లో వచ్చిన ‘వనజ’ లాంటి సినిమాలతో పాటు రాజమౌళి ‘ఈగ’ కూడా అనేక అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు పొందాయి. కాబట్టి RRRకు వచ్చిన ఆస్కార్ మాత్రమే టాలీవుడ్ కు వచ్చిన అంతర్జాతీయ అవార్డ్ గా భావించలేం. కానీ, ‘‘నాటు నాటు’’కు వచ్చిన ఆస్కార్ అవార్డ్ రీసౌండ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని అవార్డుల కంటే ఘనంగా మోగింది.. అది సబబే కూడా!
సినిమాలు మాత్రమే కాదు.. ప్రపంచం లోనే ఓకే చోట సినిమాల ప్రొడక్షన్ కు సంబంధించిన ఫెసిలిటీ ఇస్తున్న సంస్థ గా రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పింది. CBFC - 2014 రిపోర్ట్ ప్రకారం భారత దేశంలోనే అత్యధిక సినిమాలను మన టాలీవుడ్ నిర్మిస్తోంది.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్