Tamil Film Producers Council: వచ్చే నెల నుంచి షూటింగ్స్ బంద్ - ధనుష్‌పై దండెత్తిన నిర్మాతలు, ఎందుకీ గొడవ?
Tamil Film Producers Council: తమిళంలో నిర్మాతలు ఇబ్బందులు పడకూడదని కౌన్సిల్ నిర్ణయించింది. ముఖ్యంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టే హీరోగా ధనుష్ పేరు హైలెట్ అయ్యింది.
Tamil Film Producers Council: ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి బ్రేక్స్ అనేవి ఉండవు. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడం కోసం సినీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. కానీ వాటికి భిన్నంగా తమిళ సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) చేసిన ప్రకటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆగస్ట్ 16న కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ప్రారంభించవద్దని, నవంబర్ 1 నుంచి సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ ఆపేయాలని టీఎఫ్‌పీసీ నిర్ణయించుకుంది. . ఇందుకు కారణం ఏమిటనేది టీఎఫ్‌పీసీ బయటపెట్టింది.
నిర్మాతల మీటింగ్..
కోలీవుడ్‌లో అనేక స్టేజ్‌లలో పనులు అనేవి పెండింగ్ ఉన్నాయని, వాటిని పూర్తి చేయడం కోసమే ఇలా నిర్ణయం తీసుకున్నట్టు టీఎఫ్‌పీసీ ప్రకటించింది. అంతే కాకుండా హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా హీరోలు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారని.. దానివల్ల కూడా కాస్ట్‌లు పెరుగుతున్నాయని తెలిపింది. వీటన్నింటిపై సమీక్ష నిర్వహించడం కోసం సమయం పడుతుందని టీఎఫ్‌పీసీ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నైలో దీనికి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్, తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ మధ్య మీటింగ్ కూడా జరిగింది.
ధనుష్ హైలెట్..
ఈ మీటింగ్‌లో అడ్వాన్స్‌లు తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్‌ను ఆర్టిస్టులు వదిలేసి వెళ్లిపోతున్నారనే అంశాన్ని చర్చించారు. ఇప్పటినుంచి ఒక మూవీ కోసం అడ్వాన్స్ తీసుకున్న టెక్నీషియన్లు, నటీనటులు.. అది పూర్తయిన తర్వాతే మరొక ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాలని సూచించారు. దీని వల్ల నిర్మాతలకు వచ్చే నష్టాలు కొంతవరకు అయినా తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మీటింగ్‌లో ధనుష్ పేరు హైలెట్ అయ్యింది. కొత్త ప్రాజెక్ట్స్‌లో ధనుష్‌ను హీరోగా ఎంపిక చేయాలని అనుకునే నిర్మాతలు ఒకసారి ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. 2023లో శ్రీ తేనండాళ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ.. ధనుష్‌కు అడ్వాన్స్ ఇచ్చారని, అయినా తను షూటింగ్‌కే రాలేదని ఆరోపించారు.
కమిటీ ఏర్పాటు..
ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన 8 వారాల తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో విడుదల కావాలని టీఎఫ్‌పీసీ గట్టిగా చెప్పింది. ఈ నిర్ణయం వల్ల భారీ బడ్జెట్ సినిమాలకు కలెక్షన్స్ విషయంలో నష్టాలు రాకుండా ఉంటాయని భావించింది. పూర్తికాని సినిమాలు పూర్తి చేయడం కోసం ఆగస్ట్ 16 నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదని తెలిపింది. ప్రస్తుతం ఏ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయో టీఎఫ్‌పీసీకి అధికారిక లెటర్స్‌లో తెలపాలని అన్నారు. సెట్స్‌పై ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి అక్టోబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు తీర్చడానికి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటయ్యింది. తమిళ సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఈ కమిటీ తీర్చనుంది.
TFPC - Tamil Film Producers Council:
— Raghavan Ramesh (@iam_raghavan) July 29, 2024
- Top Tamil Star movies on OTT only after 8 weeks in theatres..
- No new Tamil movies can start after August 15th..
- Current movies should complete shoot by October 31st..
- No shooting from November 1st#Kollywood pic.twitter.com/LNFxBhtbxq
Also Read: మంచు విష్ణు నిర్ణయంపై స్పందించిన మీనా - ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి మరీ స్టేట్‌మెంట్