Neha Shetty: 'టిల్లు 3’లో రాధిక ఉంటుందా? - నేహా శెట్టి సమాధానం ఇదే!
Neha Shetty: ‘డీజే టిల్లు’లో రాధిక పాత్రతో ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది నేహా శెట్టి. అయితే ఈ మూవీ ఫ్రాంచైజ్‌లో మళ్లీ తను కనిపించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు తను సమాధానమిచ్చింది.
Neha Shetty About Tillu Franchise: ఒక యాక్టర్.. తమ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. అందులో తమతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమా, గుర్తుండిపోయే పాత్ర ఒకటి కచ్చితంగా ఉంటుంది. అలా యంగ్ బ్యూటీ నేహా శెట్టి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘డీజే టిల్లు’. అందుకే రాధిక పాత్ర నేహాకు ఎనలేని క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. దానివల్లే తనకు టాలీవుడ్‌లో మరెన్నో ఆఫర్లు కూడా దగ్గాయి. ప్రస్తుతం యంగ్ హీరోల సరసన నటించే హీరోయిన్లలో నేహా శెట్టి పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. అయితే తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రను మళ్లీ తెరపైన చూడవచ్చా అనే ప్రశ్నకు ఈ భామ సమాధానమిచ్చింది.
మళ్లీ చూడొచ్చా?
‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తాజాగా ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదొక పర్ఫెక్ట్ సీక్వెల్ అంటూ ప్రేక్షకులంతా దీనికి ఫిదా అయ్యారు. 2024లో విడుదలయిన తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ‘టిల్లు స్క్వేర్’ కచ్చితంగా ఉంటుంది. అయితే ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి పెయిర్‌కు యూత్ ఫిదా అయ్యారు. అయినా కూడా సీక్వెల్‌లో నేహాను కాకుండా అనుపమను హీరోయిన్‌గా తీసుకున్నారు మేకర్స్. కానీ ‘టిల్లు స్క్వేర్’లో రాధిక పాత్రలో గెస్ట్ రోల్‌లో కనిపించింది నేహా. అసలు రాధిక పాత్ర ఏమైంది, తర్వాత తనకు ఏం జరిగింది అనేది టిల్లు ఫ్రాంచైజ్‌లో చూడవచ్చా అనే ప్రశ్నకు నేహా సమాధానమిచ్చింది.
చెప్పలేం..
‘‘రాధిక కథను మేకర్స్ ఇంకా చెప్పాలనుకుంటే చెప్తారు. సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు ముందు, వెనుక ఏం జరుగుతుందో తెలియకుండానే ఆ డైలాగ్ బయటికి వచ్చేస్తుంది. అలాగే టిల్లు స్క్వేర్‌లో రాధిక బెంగుళూరు వెళ్లిపోతున్నా అని చెప్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు’’ అని చెప్పుకొచ్చింది నేహా శెట్టి. మరి బెంగుళూరు వెళ్లిపోయిన రాధిక.. నిజంగానే అక్కడ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా అని అడగగా.. ‘‘చెప్పలేం. టిల్లు కోసం తను మళ్లీ తిరిగి రావచ్చు’’ అంటూ ప్రేక్షకులను మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేసింది నేహా శెట్టి.
బుజ్జి చాలా స్ట్రాంగ్..
‘డీజే టిల్లు’ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది నేహా శెట్టి. ఇక త్వరలోనే విశ్వక్ సేన్ సరసన నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నేహా తను నటించిన పాత్రలు అన్నింటి గురించి ఒకసారి గుర్తుచేసుకుంది. ‘‘రాధిక అనేది ఈతరానికి తగిన క్యారెక్టర్. బెదురులంకలో చిత్ర ఎప్పుడూ సంతోషంగా ఉండే పాత్ర. తను కూడా ఈతరానికి తగిన అమ్మాయే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి చాలా సాఫ్ట్‌గా, హుందాగా, అందంగా ఉంటుంది. అంతే కాకుండా తను చాలా స్ట్రాంగ్. ప్రపంచంలోని ప్రతీ అమ్మాయికి బుజ్జి పాత్ర అద్దంపడుతుంది. కాకపోతే ఇది 90ల్లో కథ. బుజ్జికి ఎప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసు. తనకు కొన్ని పనులు చేయడం నచ్చదు కానీ ప్రపంచం కోసం చేస్తుంది’’ అంటూ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో బుజ్జి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది నేహా.
Also Read: చాలా బూతులు మాట్లాడా, మ్యూట్ చేస్తారనుకున్నా - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీపై అంజలి కామెంట్స్