Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
హీరో నాని దగ్గర కో డైరెక్టర్లు డబ్బులు కొట్టేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఓ స్కామ్ బయటపెట్టారు. ఆయన ఏం చెప్పారంటే...
'అష్టా చమ్మా'తో తెలుగు తెరకు నాని కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అయితే, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకు తొలి సినిమా అది కాదు. హీరోగా మాత్రమే తొలి సినిమా. హీరో కావడానికి ముందు సహాయ దర్శకుడిగా పని చేశారు. శ్రీకాంత్, స్నేహ జంటగా బాపు తెరకెక్కించిన 'రాధా గోపాళం' సినిమాకు నాని (Nani) అసిస్టెంట్ డైరెక్టర్. బాపు స్కూల్ నుంచి వచ్చానని గర్వంగా చెప్పుకొంటానని ఆయన తెలిపారు.
సహాయ దర్శకుడిగా పని చేసేటప్పుడు తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా లేటెస్ట్ ఇంటర్వ్యూలో నాని షేర్ చేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ 'రావణాసుర' ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి సరిగ్గా వారం రోజుల ముందు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' విడుదల అవుతుంది. ఈ సందర్భంగా రవితేజ, నాని కలిసి సరదగా ముచ్చటించుకున్నారు. ఈ హీరోలు ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేశారు.
నన్ను డ్రైవర్ చేసేశారు...
బాగా వాడేసుకున్నారు!
ఒకరిద్దరు కో డైరెక్టర్లు నన్ను డ్రైవర్ కింద వాడుకున్నారని హీరో నాని తెలిపారు. నటుడిగా అవకాశాల కోసం ట్రై చేసినప్పుడు అటువంటి అనుభవాలు ఎదురు అయ్యాయని తెలిపారు. ఒక్క చిన్న రోల్ కూడా ఎవరూ తనకు కాల్ చేయలేదని ఆయన చెప్పారు. డ్రస్సులు కూడా కొనుక్కోకుండా పండగల కోసం అని తాను జాగ్రత్తగా దాచుకున్న డబ్బులు కూడా కొట్టేసేవారని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి స్కామ్స్ ఫేస్ చేశానని నాని తెలిపారు.
మళ్ళీ మళ్ళీ మోసపోవడం తన వల్ల కాదని నటుడిగా ప్రయత్నాలు చేయడం ఆపేశానని నాని వివరించారు. అక్కడి నుంచి సహాయ దర్శకుడిగా మారినట్లు ఆయన పేర్కొన్నారు. 'అష్టా చమ్మా'లో హీరో రోల్ కోసం ఆడిషన్స్ చేస్తున్న సమయంలో మోహనకృష్ణ ఇంద్రగంటికి తన నటన నచ్చడంతో తనకు హీరోగా అవకాశం ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. తొలుత హీరోగా తాను సక్సెస్ కానని అనుకున్నానని... అయితే తన అభిప్రాయం తప్పని అర్థమైందని ఆయన అన్నారు. అదీ సంగతి!
Also Read : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
'దసరా' సినిమాకు వస్తే... సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఇందులో కీర్తీ సురేష్ కథానాయిక. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారం కోసం నాని వివిధ నగరాలు తిరుగుతున్నారు.
'దసరా' మాస్ సినిమా. రూరల్ నేపథ్యంలో తీసిన రగ్గడ్ సినిమా. దీని తర్వాత మళ్ళీ క్లాస్ సినిమా చేస్తున్నారు నాని. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ... వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో సినిమా స్టార్ట్ చేశారు. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. అదీ పాన్ ఇండియా సినిమాయే. దానికి మలయాళ సినిమా 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకులు అందరినీ తన పాటలతో ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read : చావడానికి అయినా సిద్ధమే - విష్ణుతో గొడవపై ఓపెన్ అయిన మనోజ్