Nag Ashwin: ఆ రెండు హాలీవుడ్ సినిమాలే నా ఇన్‌స్పిరేషన్ - నాగ్ అశ్విన్
Nag Ashwin: ‘కల్కి 2898 ఏడీ’.. హాలీవుడ్ రేంజ్‌లో ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం తనను ఇన్‌స్పైర్ చేసిన హాలీవుడ్ చిత్రాలంటే బయటపెట్టాడు నాగ్ అశ్విన్.
Nag Ashwin About Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఇప్పటికీ చాలా థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని చాలామంది ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ నుంచి వచ్చిన హాలీవుడ్ రేంజ్ సినిమా అని అంటున్నారు. కొందరు అయితే ‘కల్కి 2898 ఏడీ’ను ‘హ్యారీ పాటర్’ అనే ఇంగ్లీష్ మూవీతో పోలుస్తున్నారు కూడా. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే ‘హ్యారీ పాటర్’ గుర్తొస్తుందని అంటున్నారు. తాజాగా ఆ కామెంట్స్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు. తనను ఇన్‌స్పైర్ చేసిన హాలీవుడ్ చిత్రాల గురించి బయటపెట్టాడు.
వాటి ప్రభావం..
తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ గురించి మీడియాతో ముచ్చటించాడు నాగ్ అశ్విన్. ‘హ్యారీ పాటర్’, ‘ఐరన్ మ్యాన్’లాంటి సినిమాలను ‘కల్కి 2898 ఏడీ’కు ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారా అని అడగగా.. ‘‘మనం మార్వెల్ సినిమాను చూస్తూ పెరిగాం. ఈ సినిమాపై ఐరన్ మ్యాన్ కంటే గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు స్టార్ వార్స్ ప్రభావం కూడా ఎక్కువే. నాకు స్టార్ వార్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నాకు తెలియకుండానే దాని ప్రభావం కల్కిపై పడుంటుంది’’ అని తెలిపారు నాగ్ అశ్విన్. అంతే కాకుండా ‘కల్కి 2898 ఏడీ’లో హర్షిత్ రెడ్డి.. లూక్ అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. అది కూడా ‘స్టార్ వార్స్’లోని లూక్ స్కైవాల్కర్ పాత్రకు ఇన్‌స్పిరేషన్ అని తెలిపాడు.
అదే రిఫరెన్స్..
‘కల్కి 2898 ఏడీ’లో కమల్ హాసన్ క్యారెక్టరైజేషన్, లుక్స్ అనేవి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి. సుప్రీమ్ యస్కీన్‌గా కమల్ స్క్రీన్‌పై కనిపించేది కాసేపే అయినా ఆ లుక్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానిని చూస్తుంటే ‘హ్యారీ పాటర్’లోని లార్డ్ వాల్డర్మార్ట్ క్యారెక్టర్‌ను చూసినట్టే ఉందని చాలామంది కామెంట్స్ చేశారు. దానిపై కూడా నాగ్ అశ్విన్ స్పందించాడు. ‘‘మేము 120, 130 ఏళ్ల క్రితం టిబెట్‌లోని స్వామిజీల లుక్స్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నాం. కమల్ హాసన్‌కు 1890లోని ది పిక్చర్ ఆఫ్ డొరియన్ గ్రే నవలలోని డోరియన్ గ్రే పాత్ర ఇన్‌స్పిరేషన్ అని చాలాసార్లు చెప్పారు. అలాంటి లుక్ కోసం మాకు సినిమాల్లో ఎక్కువగా రిఫరెన్స్‌లు లేవు’’ అని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్.
ఆ పాత్ర కోసం..
‘హ్యారీ పాటర్’ నుంచి అసలు ఏ క్యారెక్టర్‌కు రిఫరెన్స్ తీసుకోలేదా అని అడగగా.. ‘కల్కి 2898 ఏడీ’లో వినయ్ కుమార్ పోషించిన సిరియస్ అనే క్యారెక్టర్‌కు మాత్రం ‘హ్యారీ పాటర్’లోని సిరియస్ బ్లాక్ పాత్ర రిఫరెన్స్ కాస్త ఉంటుందని తెలిపాడు నాగ్ అశ్విన్. ఇక ఈ మూవీలో యాక్టర్లు, పాత్రలు చాలా ఉన్నా కూడా అందులో ప్రతీ ఒక్కరూ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా డిజైన్ చేశాడు దర్శకుడు. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్తోంది ‘కల్కి 2898 ఏడీ’. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఈ మూవీ.. త్వరలోనే రూ.1000 కోట్లను కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.