Nachinavadu Movie Trailer : సాఫ్ట్‌వేర్ లైఫ్ & జాతకాలు - ప్రేమలో 'నచ్చినవాడు' ఎవరు?
లక్ష్మణ్ చిన్నా కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'నచ్చినవాడు' సినిమా ట్రైలర్ విడుదలైంది.
ప్రముఖ గాయకుడు యాజిన్ నిజార్ (Yazin Nizar) పాడిన 'నా మనసు నిన్ను చేర...' పాటతో ప్రేక్షకుల దృష్టిలో పడిన సినిమా 'నచ్చినవాడు'. లక్ష్మణ్ చిన్నా (Laxman Chinna) కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కావ్య రమేష్ కథానాయిక. స్ట్రీట్ డాగ్ సమర్పణలో ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై వెంకట రత్నంతో కలిసి లక్ష్మణ్ చిన్నా నిర్మిస్తున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'నచ్చినవాడు' ట్రైలర్ చూస్తే... వృత్తిపరమైన జీవితం బాగున్నప్పటికీ, వ్యక్తిగత జీవితం బాలేని ఓ యువకుడి కథ అని చెప్పేశారు. హీరోతో పాటు మరొక అబ్బాయి పాత్ర కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, జాతకాలు, లవ్ లైఫ్ వంటి అంశాలను మేళవించి సినిమా తీసినట్టు ఉన్నారు.
ఆగస్టు 18న 'నచ్చినవాడు' విడుదల
ఆగస్టు 18న 'నచ్చినవాడు' సినిమాను విడుదల చేయనున్నట్లు హీరో & దర్శక, నిర్మాత లక్ష్మణ్ చిన్నా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "మహిళల గౌరవం, ఆత్మాభిమానం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దానికి తోడు సినిమాలో చక్కటి ప్రేమకథ, సున్నితమైన హాస్యం ఉంటాయి. కథకు తగ్గట్టు నటీనటులు అందర్నీ కొత్తవాళ్లను తీసుకున్నాం. యువత కోరుకునే అంశాలు, వాళ్ళకు కావాల్సిన కథాంశం సినిమాలో ఉన్నాయి. కర్ణాటక, పాండిచ్చేరిలోని వివిధ అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరించాం. సంగీత దర్శకుడు మెజ్జో జోసెఫ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు" అని తెలిపారు.
Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను 'అను' క్యారెక్టర్ చేశా. ఆ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. అంతే కాదు... ఆమె చాలా నిజాయతీగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. ఇంత మంచి క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది'' అని చెప్పారు. పాటలు రాసిన హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... "నేను ప్రైవేట్ సాంగ్స్ రాశాను. సినిమా పాటలు రాయడం ఇదే మొదటిసారి. లక్ష్మణ్ చిన్నా తొలుత నాకు ఒక పాట రాసే అవకాశం ఇచ్చారు. ఆ పాటకు ఉదయం ట్యూన్ వస్తే మధ్యాహ్ననానికి లిరిక్స్ రాశా. ఆ తర్వాత పాటలు అన్నీ నాతో రాయించారు'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి లలిత తదితరులు పాల్గొన్నారు.
Also Read : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ జంటగా నటించిన ఈ సినిమాలో కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి.ఆర్.పి. రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్, కలరిస్ట్ : ఆర్. గోపాల కృష్ణన్, కళా దర్శకత్వం : నగేష్, గగన్, ఛాయాగ్రహణం : అనిరుద్, కూర్పు : కె.ఎ.వై. పాపారావు, కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్, పాటలు : హర్షవర్ధన్ రెడ్డి, సంగీతం : మెజ్జో జోసెఫ్, నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా & వెంకట రత్నం, కథ - కథనం - దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial