Mrunal Thakur: బిపాసాకు మృణాల్ సారీ... అప్పుడు నాకు 19 ఏళ్లు, తెలిసీ తెలియక ఏదో మాట్లాడా, క్షమించమ్మా!
Mrunal Thakur Bipasha Basu: తన పాత వీడియోపై విమర్శలు కొనసాగుతోన్న వేళ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు. 19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడినట్లు చెప్పిన ఆమె సారీ చెప్పారు.

Mrunal Thakur Apologise To Bipasha basu: గత కొద్ది రోజులుగా ట్రోలింగ్, విమర్శలకు గురవుతున్న తన పాత వీడియోపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎట్టకేలకు మౌనం వీడారు. బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసుపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ కాగా... సారీ చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు.
19 ఏళ్ల వయసులో...
ఎన్నో ఏళ్ల క్రితం సరదాగా జరిగిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో అది అని తెలిపారు మృణాల్ ఠాకూర్. '19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడాను. అప్పుడు అందంపై నేను సరదాగా చేసిన కామెంట్స్ ఇంతమందిని బాధిస్తాయని నాకు అర్థం కాలేదు. అలా మాట్లాడినందుకు తీవ్ర ఆవేదనకు గురవుతున్నా. ఎవరినీ హర్ట్ చేయాలనే అవమానించాలనో నేను అలా మాట్లాడలేదు. అది ఎన్నో ఏళ్ల క్రితం సరదాగా సాగిన ఓ ఇంటర్వ్యూ.
ఆ కామెంట్స్ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఏళ్లు గడిచే కొద్దీ అందానికి అసలైన నిర్వచనం నాకు అర్థమైంది. మనసుతో చూస్తే ప్రతి దానిలోనూ సౌందర్యం ఉంటుంది. అది ఎంతో విలువైనది.' అంటూ పేర్కొన్నారు.
Also Read: కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌పై రజనీ దండయాత్ర - ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
అసలేం జరిగిందంటే?
మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రారంభంలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. తాను బిపాసా కంటే చాలా అందంగా ఉంటానని అన్నారు. 'బిపాసా కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారు. అలాంటి వారిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారా? బిపాసా కంటే నేనే అందంగా ఉంటా.' అంటూ చెప్పారు. ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు.
తాజాగా... బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ఓ పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. 'బలమైన మహిళలు ఎప్పుడూ ఒకరి అభివృద్ధి కోసం మరొకరు కృషి చేస్తారు. మహిళలు బలంగా, దృఢంగా ఉండాలి. అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉంటారు. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనుకునే పాత కాలపు ఆలోచనల నుంచి బయటకు రండి.' అంటూ పోస్ట్ చేశారు. దీంతో పాటే 'ఎప్పుడూ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది మృణాల్‌ను ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తన కామెంట్స్‌పై మృణాల్ సారీ చెప్పారు.
ఇటీవల మృణాల్ కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ఓ ఈవెంట్‌లో ఆమె ధనుష్‌తో కలిసి నవ్వుతూ సరదాగా మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో పాటే ఆయన ఇద్దరి అక్కలను ఆమె ఇన్ స్టాలో ఫాలో కావడం కూడా డేటింగ్ వార్తలకు హైప్ ఇచ్చింది. అయితే, వీటిపై రియాక్ట్ అయిన మృణాల్... ఇలాంటి రూమర్స్ చాలా ఫన్నీగా అనిపించాయని అన్నారు. ధనుష్, అజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని... ఆయన పిలిస్తేనే 'ధనుష్ సన్నాఫ్ సర్దార్ 2' ఈవెంట్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి కనిపిస్తే ఏదో జరుగుతున్నట్లు కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మృణాల్ అడివి శేష్ డెకాయిట్‌లో నటిస్తున్నారు.






















