Monkey Man: ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ - ‘హనుమాన్’ తరహాలో హాలీవుడ్ చిత్రం, శోభితాకు గోల్డెన్ ఛాన్స్
Monkey Man Trailer: హాలీవుడ్ హీరో దేవ్ పటేల్ దర్శకుడిగా డెబ్యూ చేస్తున్న సినిమా ‘మంకీ మ్యాన్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలవ్వడంతో ‘హనుమాన్’ తరహా కథలాగా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Monkey Man Trailer: ఒక మామూలు మనిషికి సూపర్ పవర్స్ వచ్చి.. ప్రజలను కాపాడాలి అనుకుంటే ఎలా ఉంటుందో ‘హనుమాన్’ సినిమాలో చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దాదాపు అలాంటి కథతోనే హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’ కూడా తెరకెక్కిందని సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దేవ్ పటేల్ నటిస్తూ.. దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ.. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు దేవ్ పటేల్. ఈ మూవీతో శోభితా దూళిపాల హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
అందరినీ కాపాడే వైట్ మంకీ..
గత రెండేళ్లుగా ‘మంకీ మ్యాన్’ చిత్రీకరణ సాగుతోంది. దేవ్ పటేల్.. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా తానే ప్లాన్ చేసుకున్నాడు. ‘‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’’ అంటూ హీరో చెప్పిన డైలాగ్‌తో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమంతుడి ఫోటోలు కనిపిస్తాయి. ‘‘రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ’’ అని ‘మంకీ మ్యాన్’ సారాంశాన్ని ఒక డైలాగుతో చెప్పేశాడు హీరో. పెద్ద సిటీలో పేద ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అలాంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేస్తానని దేవ్ పటేల్ ముందుకు వస్తాడు. అదంతా తాను ఎలా చేస్తాడు అనేదే అసలు కథ అని ట్రైలర్‌లో స్పష్టం చేశారు మేకర్స్.
అందరూ ఇండియన్ యాక్టర్సే..
‘మంకీ మ్యాన్’లో దేవ్ పటేల్‌కు జోడీగా శోభితా దూళిపాళ నటిస్తోంది. ఇందులో హీరో ఒక వెయిటర్ పాత్రలో కనిపించగా.. శోభితా బార్ డ్యాన్సర్‌గా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో మెయిన్ విలన్స్‌గా మకరంద్ దేశ్‌పాండేతో పాటు సిఖందర్ ఖేర్ కూడా కనిపించనున్నారు. ఇందులో మకరంద్.. ఒక స్వామిజీ పాత్రను పోషిస్తున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. ఇప్పటికే హీరోగా ఎన్నో కంటెంట్ ఉన్న హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు దేవ్ పటేల్. ఇప్పుడు మొదటిసారి ‘మంకీ మ్యాన్’తో డైరెక్టర్‌గా మారాడు. ముంబాయ్ సిటీలో తెరకెక్కించిన ఈ హాలీవుడ్ చిత్రంలో చాలావరకు ఇండియన్ యాక్టర్లనే తీసుకున్నాడు.
One small ember can burn down everything. #MonkeyManMovie only in theaters April 5. pic.twitter.com/hYO6MwcSev
— Monkey Man (@monkeymanmovie) January 26, 2024
రిలీజ్ ఎప్పుడంటే..
దేవ్ పటేల్ ‘మంకీ మ్యాన్’కు దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇతర నిర్మాతలతో కలిసి తాను కూడా సినిమా ప్రొడక్షన్‌లో భాగస్వామి అయ్యాడు. యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్.. ‘మంకీ మ్యాన్’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ.. ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకున్న శోభితా.. ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్ యాక్టర్ల లిస్ట్‌లో చేరనుంది.
Also Read: చేతిలో పైసలేని రోజు నుంచి అత్యధిక ట్యాక్స్ కట్టే స్థాయి వరకు.. ఇది 'పద్మభూషణ్' మిథున్ లైఫ్ జర్నీ