Maharshi Raghava: 100వ సారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ - ఘనంగా సత్కరించిన చిరంజీవి
Maharshi Raghava: మహర్షి రాఘవ సమాజానికి తన వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఏకంగా వందసార్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను మెగాస్టార్ అభినందించారు. ప్రత్యేకంగా సన్మానం చేశారు.
![Maharshi Raghava: 100వ సారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ - ఘనంగా సత్కరించిన చిరంజీవి Megastar Chiranjeevi felicitated Actor Maharshi Raghava Donating Blood For 100 Times Maharshi Raghava: 100వ సారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ - ఘనంగా సత్కరించిన చిరంజీవి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/13faefb7906c5b49024eb25184826ac61713414998566932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Megastar Chiranjeevi felicitated Actor Maharshi Raghava: రక్తం అందక నిత్యం ఎంతోమంది మరణించిన రోజులు చూశాం. అయితే, అలాంటి రోజులు రాకూడదని, రక్తం లేక ఎవ్వరూ ప్రాణాలు కోల్పోవద్దనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ని స్థాపించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. తను సేవ చేస్తూ ఎంతోమంది అభిమానులతో సేవ చేయిస్తున్నారు. అలా స్ఫూర్తి పొందిన వారిలో ఒకరు యాక్టర్ మహర్షి రాఘవ. చిరంజీవి ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేశారు ఆయన. సమాజానికి తన వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో రక్తదానం చేశారు. దీంతో చిరంజీవి స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని ఆయనకు ప్రత్యేకంగా సన్మానం చేశారు, రాఘవని అభినందించారు.
1998 నుంచి ఇప్పటి వరకు..
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 1998 అక్టోబర్ 2న ప్రారంభించారు. కాగా.. ఆ రోజు మొదట రక్తదానం చేసిన వ్యక్తి మురళీ మోహన్ కాగా.. ఆయన తర్వాత చేసిన వ్యక్తి మహర్షి రాఘవ. ఇక అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా రాఘవ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఇస్తూ వచ్చారు. అలా ఇప్పటి వరకు 100 సార్లు రక్తం ఇచ్చారు. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి.. వందోసారి రక్తదానం చేసే సమయంలో తను దగ్గరుండి డొనేట్ చేయిస్తానని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఇప్పుడు మహర్షి రాఘవను ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. మూడు నెలలకు ఓ సారి 100 సార్లు రక్తదానం చేయటం గొప్పవిషయమని ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ మొదటివాడని చిరంజీవి అభినందించారు. ఆయన్ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
ఇక రాఘవతో పాటు ఆయన సతీమణి శిల్ప కూడా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శిల్పతో 'ఆపద్భాంవుడు' సినిమా విశేషాలు గుర్తు చేసుకుని, సినిమా గురించి మాట్లాడారు చిరంజీవి. మహర్షి రాఘవతో పాటు.. ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలిశారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు సీఓఓ రమణస్వామి నాయుడు, మెడికల్ ఆపీసర్ డాక్టర్ అనూషగారి ఆధ్వర్యంలో మహర్షి రాఘవ 100వ సారి రక్తదానం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)