Jam Jam Jajjanaka Song Promo: ‘భోళా శంకర్’ మూవీ నుంచి మరో సాంగ్ - ఫ్యాన్స్‌కు పండుగలాంటి పాట ఇది!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ చేసిన సెలబ్రేషన్ సాంగ్ అభిమానులతో చిందులేయిస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. తమిళ మూవీ ‘వేదాళం’కు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించనుంది. హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి సహా పలువురు నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అభిమానులు బాగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘భోళాశంకర్’ నుంచి మరో సాంగ్ ప్రోమోను ఆదివారం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘‘జామ్ జామ్ జజ్జనక..’’ పూర్తి పాటను జులై 11, సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
డబ్బింగ్ పూర్తి చేసిన చిరంజీవి
'భోళా శంకర్' డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, ఈ మూవీ రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. "భోళా శంకర్ సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందం కలిగించింది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంద" అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 'భోళా శంకర్' ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్న ఆయన.. థియేటర్లో కలుద్దాం అంటూ #భోలాశంకర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో బాస్ మళ్లీ త్వరలోనే వెండితెరపై మ్యాజిక్ చేయనున్నాడని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబ్బింగ్ పూర్తికావడంతో చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి అమెరికా చెక్కేశారు. అక్కడే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనున్నారు. అమెరికా నుంచి ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.
‘భోళాశంకర్’ షూటింగ్ పూర్తి
తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మెహర్ రమేష్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ‘భోళాశంకర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “‘భోళాశంకర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గడిచిన కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ కోసం కష్టపడిన నటీనటులు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాలు, పాటల విడుదల త్వరలోనే మొదలవుతుంది” అని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.
హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న అభిమానులు
మెగాస్టార్ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి హిట్లు అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘భోళాశంకర్’ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ అందుకోవాలని భావిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా 'భోళా శంకర్' విడుదల
‘భోళాశంకర్’ మూవీని ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే వెల్లడించింది. విడుదల తేదీ మార్చే అవకాశం ఉందని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేసింది. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు.