Rajinikanth: పెద్ద స్కామే.. రజనీకాంత్ పేరుతో రూ.లక్షల్లో మోసాలు - ఈ కేటుగాళ్ల వలకు చిక్కితే అంతే!
Thalaivar 171 - Code Red: రజినీకాంత్ సరసన నటించాలని లేదా ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఆ కోరికను అడ్డంపెట్టుకొని బెంగుళూరులో ఓ వ్యక్తి భారీ స్కామ్‌కు పాల్పడ్డాడు.
Rajinikanth Thalaivar 171 - Code Red Scam: ఏ రంగంలో అయినా స్కామ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎవరినైనా స్కామ్ చేయడం చాలా సింపుల్ అని క్రిమినల్స్ భావిస్తుంటారు. అందుకే తాజాగా రజనీకాంత్ పేరు చెప్పుకొని భారీ స్కామ్‌కు పాల్పడ్డారు దుండగులు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోహీరోయిన్లు అవ్వాలనే కోరికతోనే వస్తారు లేదా పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా చాలు అనుకుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ తాజాగా స్కామ్‌కు పాల్పడ్డారు దుండగులు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ స్కామ్ బెంగుళూరులో జరిగింది.
క్యాస్టింగ్ కాల్..
ఆసక్తికరమైన మ్యూజిక్‌తో ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాత క్యాసెట్ కనిపిస్తుంది. ఆ తర్వాత డైరెక్టెడ్ బై లార్స్ పీటర్స్ అని చూపిస్తుంది. ఈ వీడియో అంతా ఒక క్యాస్టింగ్ కాల్‌కు సంబంధించింది. అంటే నటనలో ఆసక్తి ఉన్నవారికి ఆడిషన్స్ కోసం పిలుపు. ఇందులో హైలెట్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరో రజనీకాంత్ అట. అంత పెద్ద స్టార్ సినిమాలో చిన్న రోల్ అయినా పర్వాలేదు అనుకునేవారు చాలామంది ఉంటారు. అందుకే ఈ ఆడిషన్స్‌కు వెళ్లారు. అలా చాలామంది మోసపోయారు. ఎందుకంటే ఇదంతా వారి స్కామ్‌లో భాగమే. నిజంగా అది రజనీకాంత్ సినిమా కాదు.. దానికి సంబంధించిన ఆడిషన్స్ ఏమీ జరగడం లేదు.
బెంగుళూరులో స్కామ్..
‘తలైవర్ 171 - కోడ్ రెడ్’ అనే సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు కావాలంటే కర్ణాటకలోని బెంగుళూరులో ఒక ఆడిషన్స్ పోస్ట్ ప్రత్యక్షమయ్యింది. మామూలుగా ఇలాంటి ఆడిషన్స్ ప్రకటనలు చాలానే కనిపిస్తుంటాయి. కానీ రజనీకాంత్ సినిమా అనేసరికి చాలామంది ఆసక్తి చూపించారు. అలా ఆడిషన్స్‌కు వెళ్లినవారికి క్యాస్టింగ్ డైరెక్టర్స్ అంటూ కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. ‘తలైవర్ 171 - కోడ్ రెడ్’లో కచ్చితంగా పాత్ర కల్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు వసూళు చేశారు. వారు మోసపోయామని చాలా లేటుగా తెలుసుకున్నారు. దీంతో మృదుల అనే ఒక బాధితురాలు ఈ స్కామ్ గురించి ముందుగా బయటపెట్టింది.
చాలామంది బాధితులు..
‘తలైవర్ 171 - కోడ్ రెడ్’లో నటించడం కోసం రూ.3.9 లక్షలను క్యాస్టింగ్ డైరెక్టర్స్‌కు అందజేసింది మృదుల. రజనీకాంత్ సినిమాలు నటించే అవకాశం వచ్చేసినట్టే అని ఎంతో సంతోషపడింది. ఈ స్కామ్‌కు లీడర్‌గా ఉన్న వ్యక్తి పేరు సురేశ్ కుమార్. తనే క్యాస్టింగ్ డైరెక్టర్‌గా ఆడిషన్స్‌కు వచ్చిన వారందరినీ పరిచయం చేసుకున్నాడు. తను మోసపోయానని తెలుసుకున్న మృదుల.. బెంగుళూరులోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు ముందస్తుగా జరిపిన విచారణలో మృదులలాగా ఇంకా ఎంతోమంది దగ్గర నుండి సురేశ్ డబ్బులు తీసుకున్నాడని తెలిసింది. అతడు చాలామందిని మోసం చేసి పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు.