'గుంటూరు కారం' మ్యూజిక్‌పై మహేష్ అసంతృప్తి - ఎట్టకేలకు స్పందించిన థమన్!
త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా నుండి థమన్ ని తప్పించారనే వార్త ఇటీవల వైరల్ అవ్వగా.. తాజాగా ఈ వార్తలపై తమన్ క్లారిటీ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తీసేసారనే వార్త ఆ మధ్య గట్టిగా వినిపించింది. అయితే తమన్ దాని గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా సెటైర్ వేస్తూ పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. 'బ్రో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'గుంటూరు కారం' సినిమా గురించి మాట్లాడారు. ‘‘ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పాటలు కూడా చాలా బాగా వస్తున్నాయి. కచ్చితంగా రేపు థియేటర్స్ లో ఈ ఆల్బమ్ ని ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది" అంటూ తాజాగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా చెప్పుకొచ్చారు తమన్.
ఇక 'గుంటూరు కారం' నుంచి తనను తప్పించారనే విషయంపై స్పందిస్తూ.. "అది పూర్తిగా అవాస్తవం. ఒకవేళ సినిమా నుంచి నన్ను తీసేస్తే ప్రొడ్యూసర్ చెప్తారు కదా. కానీ సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారు. ఇలాంటి రూమర్స్ ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు సినిమా ఆలస్యం అవ్వడం అనేది సహజం. కొన్ని సినిమాలు 4- 5 సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్నవి కూడా ఉన్నాయి. అలా అని దాన్ని భూతద్దంలో పెట్టి పదేపదే దాని గురించి రాయాల్సిన అవసరం లేదు. అందరూ ఆ సినిమా మీదే పడ్డారెందుకో అర్థం కావట్లేదు. అంతా బాగానే ఉంది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని నమ్మకండి. ప్రస్తుతం మేమంతా కలిసి సినిమా కోసం పనిచేస్తున్నాం" అంటూ తెలిపారు. ఇక ఈ కామెంట్స్ తో 'గుంటూరు కారం' సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేసారు తమన్. ఇక మరోవైపు తమన్ ప్రస్తుతం 'బ్రో' సినిమాతో ప్రేక్షకులు ముందుకు కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.
త్వరలోనే 'బ్రో' సినిమాకు సంబంధించి ఓ ప్రమోషనల్ సాంగ్ విడుదల కాబోతోంది. ఈ ప్రమోషనల్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఈ పాట ఉర్రూతలూగించడం ఖాయం అంటూ తమన్ ధీమా వ్యక్తం చేశారు. జి స్టూడియోస్ సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక 'గుంటూరు కారం' విషయానికొస్తే.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల పూజా హెగ్డే ఈ సినిమా నుంచి ఇటీవల హీరోయిన్‌గా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో పూజ హెగ్డే స్థానంలో మహేష్ కి జోడిగా శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని మూవీ టీం సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఇంత స్పీడ్‌గా ఎలా దళపతీ - ‘లియో’ షూటింగ్ పూర్తి చేసిన విజయ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial