Mahesh Babu: 'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
'ముఫాసా : ది లయన్ కింగ్' సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20 న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరో ముఫాస పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చారో తెలుసా ?
హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్లో హాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 'ముఫాసా : ది లయన్ కింగ్' (Mufasa The Lion King) సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కంటే, అందులో లయన్ కింగ్ ముఫాసాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఇలాంటి ఒక యానిమేషన్ మూవీకి మహేష్ బాబు (Mahesh Babu) ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు మన సూపర్ స్టార్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'ఎస్ఎస్ఎంబి 29' అనే పాన్ వరల్డ్ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు 'ముఫాసా : ది లయన్ కింగ్' అనే సినిమాలో ముఫాస అనే హీరో పాత్రకి గాత్రదానం చేశారు. 2019లో రిలీజ్ అయిన 'ది లయన్ కింగ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సినిమాను ఇప్పుడు విజువల్ లైవ్ యాక్షన్ మూవీగా 'ముఫాసా : ది లయన్ కింగ్' పేరుతో డిసెంబర్ 20న సరికొత్తగా తెరపైకి తీసుకురాబోతున్నారు.
అయితే తెలుగు డబ్బింగ్ వర్షన్ లో మాత్రం ముఫాసాగా మహేష్ బాబు, పుంబాగా బ్రహ్మానందం, టిమోన్ గా అలీ, టాకాగా సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం గురించి మహేష్ బాబు మాట్లాడారు. "ఇప్పటి వరకు హాలీవుడ్ యానిమేషన్ నుంచి వచ్చిన అత్యంత పాపులర్ పాత్రలలో ఇది కూడా ఒకటి. ఇది నాకు ఒక డ్రీమ్ నెరవేరిన క్షణం అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో నేను ఈ పాత్రకి పెద్ద అభిమానిని. నాకు ముఫాస పాత్ర బాగా నచ్చుతుంది. తెరపై ఆయన పాత్రను చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా ఒక గౌరవం. ఈ పాత్ర ప్రతి తరానికి ఇష్టమైన రోల్. కాబట్టి ముఫాస రోల్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నిజంగా సంతృప్తికరంగా ఉంది" అంటూ సినిమా రిలీజ్ గురించి తనెంత ఉత్సాహంగా ఉన్నారో చెప్పుకొచ్చారు.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే
బారీ జంకిన్స్ దర్శకత్వం వహించిన 'ముఫాసా : ది లయన్ కింగ్' సినిమాకు లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్ ను ఉపయోగించి ఫోటో రియల్ కంప్యూటర్ ద్వారా ఆ పాత్రలకు జీవం పోశారు. అయితే ఇందులో సత్యదేవ్ విలన్ పాత్ర టాకాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు వెర్షన్ కు మొత్తం బ్రహ్మానందం, మహేష్ బాబు, అలీ వంటి ప్రముఖ నటులు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో లయన్ కింగ్ ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తెరపై చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 20న తెలుగుతో పాటు హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
Also Read : అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?