Look Back 2024 - Sequels: కల్కి, సలార్ to పుష్ప 2, దేవర... పిక్చర్ అభీ బాకీ హై ఆడియన్స్ - అసలు కథ సీక్వెల్‌లో ఉందండోయ్!
Look Back 2024 - Sequels And Prequels In Telugu Cinema: ఈ ఏడాది పాన్ ఇండియా హిట్స్ సాధించిన టాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన సినిమాలు అన్నిటికీ సీక్వెల్స్ ఉన్నాయి. కథలు కంటిన్యూ అవుతున్నాయి.
Sequels and Prequels Mania in Indian Cinema: ‘పుష్ప 2’ విడుదలైంది. వెయ్యి కోట్లు సాధించింది. రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. ‘పుష్ప 3’ ప్రకటన కూడా వచ్చేసింది. పుష్ప ఒక్కటే కాదు... 2024లో టాలీవుడ్ స్టార్స్ నటించిన పాన్ ఇండియా సినిమాలు కల్కి 2898 ఏడీ, సలార్, దేవర సినిమాలు అన్నిటికీ సీక్వెల్స్ ఉన్నాయి. అసలు ఈ పాన్ ఇండియా క్రేజ్, సీక్వెల్స్ కల్చర్ మొదలైనది బాహుబలి సినిమాలతో! ఆ తర్వాత ఈ ట్రెండ్‌ను కన్నడ ‘కేజీఎఫ్’ సిరీస్ కొనసాగించింది. అయితే పాన్ ఇండియా సినిమాలంటే ఒక్క భాగం చాలదు అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. సీక్వెల్స్, ప్రీక్వెల్స్ కూడా తీస్తామంటున్నారు.
బాహుబలి రూటే సెపరేటు
‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ కు మొదట్లో కాస్త నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమ్యాక్స్ ను బాహుబలిని కట్టప్ప చంపడంతో ముగించి, పెద్ద ట్విస్టే ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. ‘‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’’ అంటూ ఇంట్రస్టింగ్ పాయింట్ రాజమౌళి అండ్ టీమ్ చేసిన మార్కెటింగ్ మ్యాజిక్ తో బాహుబలి రెండో భాగం ‘బాహుబలి ది కంక్లూషన్’ మరింతగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకెళ్లింది. ఇక సినిమా కూడా అంచనాలకు మించి ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్’ డబ్బింగ్ సినిమాగా విడుదలైంది. అప్పట్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరో తెలీదు. కన్నడ హీరో యశ్ అసలు మన తెలుగు వారికి పరిచయమే లేదు. కానీ ‘కేజీఎఫ్’ భారీ హిట్ అయింది. ‘కేజీఎఫ్’ మొదటి భాగం ఇచ్చిన క్రేజ్, ‘కేజీఎఫ్’ రెండో భాగాన్ని పాన్ ఇండియా సినిమా గా మార్చింది. ‘కేజీఎఫ్’ పార్ట్ 3 కూడా హీరో యశ్ లైనప్ లో ఉంది. డబ్బింగ్ సినిమాగా విడుదలైంది కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అప్పట్లో పెద్దగా అంచనాల్లేవు. ‘కాంతార’ హిట్ అయ్యింది. ప్రీక్వెల్ ఉంటుందని సినిమాలోనే హింట్ ఇచ్చేశారు దర్శకనిర్మాతలు. ‘కాంతార’ సూపర్ హిట్ కావడంతో, ఆ క్రేజ్ ను అందుకోవాలనే ఉద్దేశంతో ప్రీక్వెల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు రెండున్నాయ్...
సలార్, కల్కితో పాటు ఎన్టీఆర్ దేవర!
ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే ఆ సినిమాలు హఠాత్తుగా ముగించిన తీరు ప్రేక్షకులకు నివ్వెర పరిచింది. దేవా పాత్ర హీరోయిన్ ను ఎందుకు కాపాడుతుంది? అతని నేపథ్యం ఏంటో చూచాయిగా 'సలార్' సినిమాలో చెప్పేసి ఠక్కున ముగించారు ప్రశాంత్ నీల్. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోనూ అంతే, హీరోయిన్ ను కాపాడే బౌంటీ హంటర్ భైరవ (ప్రభాస్) కు మరో కోణం ఉందనీ, అతను కర్ణుడని చివర్లో రివీల్ చేశారు దర్శకుడు నాగ అశ్విన్. అసలు నిజంగా అతను కర్ణుడా? లేక అతను ఆ వంశానికి చెందిన వాడా? అనేది పూర్తిగా చెప్పకుండా కల్కి మొదటి భాగాన్ని ముగించారు. భవిష్యత్తులో కల్కి 2, 3 భాగాలు కూడా ఉంటాయట. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా కూడా అసంపూర్తిగా ముగిసి ఫీలింగ్ కలుగుతుంది. ‘దేవర’ అనే వ్యక్తి కథతో సినిమాను మొదలుపెట్టారు. తర్వాత అతను కనిపించకుండా పోయాడన్నారు. సముద్రంలోకి వచ్చిన విలన్ గ్యాంగ్ ను చంపుతున్నది మరెవరో కాదు దేవర కొడుకు వర అని చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చారు. అంతే కాదు తండ్రి దేవరను చంపింది కొడుకు వర అని కథలోని మరో ముడి విప్పారు చిత్ర దర్శకుడు కొరటాల శివ. అసలు తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు? అనేది తెలియాలంటే దేవర రెండో భాగం వరకూ ఆగాల్సిందే.
జపాన్ ఏమైంది పుష్పరాజ్... మూడో పార్టులో చూడాలా?
‘పుష్ప 2’ సినిమా జపాన్ లోని ఓ ఫైట్ తో మొదలవుతుంది. మళ్లీ ఫ్లాష్ బ్యాక్ కు కట్ అయిపోతుంది సినిమా. పుష్ప తొలి భాగం పెళ్లితో ముగుస్తుంది. పుష్ప రెండో భాగం అతని చెల్లి పెళ్లితో ముగుస్తుంది. అసలు పుష్పరాజ్ జపాన్ ఎందుకు వెళ్లాడు? ఎందుకు ఫైట్ చేశాడు? అసలు అతని డబ్బును జపాన్ విలన్లు ఎందుకు ఇవ్వలేదు? అనేవి ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ లో చూడాల్సిందేనేమో. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కు సరిపడా కంటెంట్ ‘పుష్ప’ సిరీస్ లో ఉందని దర్శకుడు సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. మరి ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’తో ఆపుతారా? లేదంటే ఇంకా కొనసాగిస్తారా? అనేదానికి సమాధానం దర్శకుడు సుకుమార్ మాత్రమే చెప్పగలరు. తొలి భాగాల్ని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ముగించి, దాన్ని సీక్వెళ్లలో చూపించాలనుకోవడం ఓ పద్ధతి. ఓ పూర్తి కథను తన బాహుబలితో చూపించిన ఘనత ఇప్పటివరకూ కేవలం దర్శకుడు రాజమౌళికే దక్కుతుందేమో! కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఫ్లాప్ అయ్యింది. కానీ, ఆ సినిమా సీక్వెల్ 'ఇండియన్ 2' నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. 'పుష్ప 3' రావడానికి టైమ్ పడుతుంది. మరి, 'కల్కి 2', 'సలార్ 2' ఎప్పుడు వస్తాయో?
Also Read: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్