రజినీకాంత్‌తో లోకేష్ మూవీ? ఆ మూవీకి సీక్వెల్ కూడా కన్ఫార్మ్ - ఆ తర్వాతే మూవీస్‌కు గుడ్‌బై?
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు.
గత ఏడాది 'విక్రమ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తలపతి విజయ్ తో 'లియో' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే విజయ్ 'లియో' తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ సినిమా చేయబోతున్నాడని ఇటీవల మలయాళ నటుడు బాబు ఆంటోని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన అలా చెప్పడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే తాజాగా ఇదే విషయంపై స్వయంగా స్పందించారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
ఇటీవల కొంతమంది అభిమానులతో ఇంటరాక్ట్ అయిన లోకేష్ కనగరాజ్ ని 'మీరు రజనీకాంత్ గారితో సినిమా చేయబోతున్నారట.. నిజమేనా? అనే ప్రశ్న అడిగారు అభిమానులు. దీనికి లోకేష్ బదులిస్తూ.." ప్రస్తుతానికైతే తాను ఏమీ చెప్పలేనని, ఈ విషయంపై ప్రొడక్షన్ హౌస్ నుంచి నేరుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని" అన్నారు. అయితే లోకేష్ కనకరాజ్ దీన్ని ఖండించకుండా పరోక్షంగా తాను రజినీకాంత్ తో సినిమా చేస్తున్నట్లు హింట్ ఇచ్చేసాడు. దీంతో స్వయంగా లోకేష్ తలైవాతో ప్రాజెక్టు గురించి ఇలా హింట్ ఇవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే రజనీకాంత్ తో ప్రాజెక్టు 'లియో' మూవీ తర్వాత ఉంటుందా? లేక 'విక్రమ్' సీక్వెల్ తర్వాత ఉంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ లో వినిపిస్తోంది. కాగా ఇదే ఫ్యాన్ మీట్ లో తాను భవిష్యత్తులో 'ఖైదీ' సీక్వెల్ కూడా చేస్తానని స్పష్టం చేశారు లోకేష్ కనగరాజ్. అంతేకాకుండా ఇంకా పది సినిమాలు చేసిన తర్వాత దర్శకుడుగా సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక లియో విషయానికొస్తే.. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. సెవెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమాలో ఆయన విజయ్ కి తండ్రిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మిస్కిన్, మన్సూర్ అలీ, గౌతమ్ మీనన్, మడోనా సెబాస్టియన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 'నా రెడీ' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకుంది. యూట్యూబ్లో ఇప్పటికే ఈ పాట 70 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని సరి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ పాటకు సంబంధించి కేవలం తమిళ వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా తెలుగు వెర్షన్ పాటను రిలీజ్ చేయాల్సి ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్, అది మారదు : అల్లు అర్జున్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial