Kalki 2898 AD Ticket Price: కల్కి టికెట్ రేట్లు... ఏపీలో భారీగా పెరుగుతాయ్, కానీ తెలంగాణ కంటే రేటు తక్కువేనా?
Kalki 2898 AD Movie Tickets: 'కల్కి 2898 ఏడీ' జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఆ సినిమా టికెట్ రేట్లు తెలంగాణలో ఎంత ఉండబోతున్నాయి, ఏపీలో ఎంత ఉండొచ్చు? అనేది తెలుసుకోండి.
Prabhas Kalki Ticket Price In AP and Telangana: 'కల్కి 2898 ఏడీ' సినిమా ఎలా ఉండబోతుంది? అనేది ట్రైలర్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేశారని, ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ అందిస్తున్నారని అర్థం అవుతోంది. సినిమా విడుదలకు మరెంతో దూరం లేదు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత ఉండబోతున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో 'కల్కి' టికెట్ రేట్లు పెరగడం గ్యారంటీ
Kalki 2898 AD ticket price in Andhra Pradesh: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సినిమా టికెట్ రేట్లు భారీ తగ్గించారు. సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' టికెట్ రేట్లు గమనిస్తే... సింగిల్ స్క్రీన్లలో గరిష్టంగా రూ. 200లకు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 230 రేట్లకు విక్రయించారు. పల్లెటూళ్లలో ఇంకా తక్కువకు అమ్మారు. అప్పట్లో టాలీవుడ్ మీద జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శలు సైతం వచ్చాయి. అయినా సరే సామాన్యులకు అందుబాటులో వినోదం తీసుకు రావడమే తమ ధ్యేయమని వైసీపీ నేతలు చెప్పారు.
'కల్కి 2898 ఏడీ' ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ ప్రొడ్యూస్ చేసిన 'సీతా రామం' సినిమాకు జగన్ ప్రభుత్వం టికెట్ రేట్ హైక్ ఇవ్వలేదు. టీడీపీకి అశ్వినీదత్ మద్దతు ఇస్తున్నారనే కారణంతో దూరం పెట్టారు. పవన్ సినిమాలకు సైతం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... ఏపీలో 'కల్కి 2898 ఏడీ'కి టికెట్ రేట్లు పెంపు విషయంలో ప్రభుత్వ పెద్దల నుంచి హామీ వచ్చిందట. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'కల్కి' టికెట్ రేటు గరిష్టంగా 375 రూపాయలు ఉండే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 250 ఉండొచ్చని టాక్.
మరి, తెలంగాణలో 'కల్కి' టికెట్ రేట్లు ఎంత?
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ విషయంలో చిత్రసీమను ఇబ్బందులు పెట్టిన దాఖలాలు లేవు. బెనిఫిట్ షోలు, హైక్స్ బాగానే ఇచ్చింది. కేసీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం చిత్రసీమతో సన్నిహితంగా ఉంటోంది. తెలంగాణలో 'కల్కి 2898 ఏడీ' సినిమాకు సింగిల్ స్క్రీన్లలో రూ. 236, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 413గా నిర్ణయించినట్టు సమాచారం.
'కల్కి' సినిమాలో దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్లుగా నటించగా... కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, శోభన, శాశ్వత ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు సినిమా విడుదల కానుంది.