Kayadu Lohar: నేనేం తప్పు చేశా... తమిళ రాజకీయాలను కుదిపేసిన కేసు, ట్రోల్స్‌పై హీరోయిన్ ఆవేదన
Kayadu Lohar On Trolls: విశ్వక్ సేన్ 'ఫంకీ'లో నటిస్తున్న హీరోయిన్ కాయదు లోహర్. తమిళంలో 'డ్రాగన్' చేసింది. కొన్నాళ్లుగా ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వాటిపై ఆవిడ స్పందించింది.

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తెలుసుగా! కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో (తమిళంలో 'డ్రాగన్') కథానాయికగా నటించింది. నిజానికి ఆ సినిమా కంటే ముందు తెలుగులో శ్రీ విష్ణు 'అల్లూరి'లో నటించింది. సినిమాలతో కాకుండా కొన్ని రోజులుగా ఆవిడ ఇతరత్రా విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. కాయదు లోహర్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఓ తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ట్రోల్స్ పట్ల ఆవిడ రియాక్ట్ అయ్యింది.
నేను ఏం తప్పు చేశా? నాపై ఎందుకిలా??
తమిళనాడు రాజకీయాలను కొన్ని రోజుల క్రితం ఒక కేసు కుదిపేసింది. ఓ ప్రభుత్వ విభాగంలో మనీ ఫ్రాడ్ జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ కేసులో కాయదు లోహర్ పేరు వినిపించింది. నైట్ పార్టీకి హాజరు అయినందుకు ఆమెకు 35 లక్షల రూపాయలు ఇచ్చారని పుకార్లు గుప్పుమన్నాయి. కాయదును పోలీసులు విచారణకు సైతం పిలిచినట్లు పేర్కొన్నారు. సదరు వార్తలపై తాజా ఇంటర్వ్యూలో కాయదు లోహర్ స్పందించారు.
Also Read: వారణాసి పబ్లిసిటీ పనులు ఫినిష్... గోవా వెళ్లిన ప్రియాంక చోప్రా... పక్కన ఉన్నది ఎవరో తెలుసా?
''నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు. నేను చేసిందల్లా... అందరితో మంచిగా ఉండటమే'' అని కాయదు లోహర్ వివరించారు. కలలను సాకారం చేసుకోవడం కోసం కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తనను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కాలేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు వచ్చిన పుకార్లు, ట్రోల్స్ తన మీద చాలా ప్రభావం చూపించాయని కాయదు వివరించారు. సెలబ్రిటీలు ప్రతిదీ హ్యాండిల్ చేస్తారని ప్రేక్షకులు భావిస్తారని, కానీ రియాలిటీలో జరిగేది వేరు అని, తమనూ ట్రోల్స్ హర్ట్ చేస్తాయని కాయదు లోహర్ వివరించారు. మరి ఇక అయినా ఆ పుకార్లకు చెక్ పడతాయో లేదో చూడాలి.
Also Read: నటి హేమకు మాతృ వియోగం... రాజోలులో ఆకస్మిక మరణం
తెలుగులో మరో సినిమా చేస్తున్న కాయదు!
శ్రీ విష్ణు 'అల్లూరి' చేశాక తమిళం సినిమా అవకాశాలు రావడంతో అటు వెళ్లిన కాయదు లోహర్... ఇప్పుడు మళ్ళీ తెలుగుకు వచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న 'ఫంకీ'లో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3న థియేటర్లలోకి 'ఫంకీ' వస్తుంది.





















