Bhaje Vaayu Vegam: ‘భజే వాయు వేగం’ ట్రైలర్‌లో కార్తికేయకి రెండే డైలాగ్‌లు - మన నాన్న కాదురా మా నాన్న అంటున్న హ్యాపీడేస్ టైసన్
Bhaje Vaayu Vegam Trailer: యంగ్ హీరో కార్తికేయ.. ఈసారి ఒక క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు. అదే ‘భజే వాయు వేగం’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది.
Bhaje Vaayu Vegam Trailer Out Now: క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలు చాలావరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఇంకా ఆ క్రైమ్‌లో ఎమోషన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు యంగ్ హీరో కార్తికేయ. కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘భజే వాయు వేగం’. ఈ సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా పూర్తిచేసి అప్పుడే విడుదలకు కూడా సిద్ధం చేశారు మేకర్స్. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవ్వడంతో తాజాగా దీని ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతూ ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది.
కోట్లలో డబ్బు మాయం..
‘‘హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం. ప్రతీ చెక్‌పోస్ట్ జాగ్రత్తగా చెక్ చేస్తాం’’ అని పోలీస్ వాయిస్ ఓవర్‌తో ‘భజే వాయు వేగం’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక రౌడీ పాత్రలో రవి శంకర్ ఎంట్రీ ఇస్తారు. ‘‘ఆ బ్యాగ్‌లో ఎంతుందో తెలుసా’’ అని అడగగానే ఒక చోటిలో కోట్లలో డబ్బు కనిపిస్తుంది. ఆ డబ్బు కనిపించకుండా పోవడమే సినిమాలోనే మెయిన్ పాయింట్ అని ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. అది ఎవరు కొట్టేశారో తెలుసుకోవడం కోసం రవి శంకర్ గ్యాంగ్ వెతకడం మొదలుపెడుతుంది. ఫైనల్‌గా వెంకట్ అనే పాత్రలో కార్తికేయ ఎంట్రీ ఇస్తాడు. తన చేతిలో ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ కనిపిస్తుంది.
హాస్పిటల్‌లో నాన్న..
‘భజే వాయు వేగం’ ట్రైలర్‌లో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు నటుడు శరత్ లోహిత్స్వా. ఒకవైపు రవి శంకర్ గ్యాంగ్, మరోవైపు శరత్ గ్యాంగ్.. కార్తికేయను పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. అదే క్రమంలో చేజ్‌లు, ఫైట్‌లు కూడా జరుగుతాయి. ‘‘వాళ్ల నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడు’’ అనే వాయిస్ ఓవర్‌తో హీరో తండ్రి పాత్రలో తనికెళ్ల భరణిని చూపించారు. తన తండ్రికి ఆపరేషన్ చేయించడం కోసం, దానికి కావాల్సిన డబ్బు కోసం కార్తికేయ.. ఏదో క్రైమ్‌లో ఇరుక్కుంటాడని అర్థమవుతుంది. ‘‘మన నాన్న కాదు.. మా నాన్న’’ అంటూ రాహుల్ టైసన్ చెప్పే డైలాగ్‌తో ‘భజే వాయు వేగం’ ట్రైలర్ ముగుస్తుంది.
‘హ్యాపీ డేస్’ హీరో కమ్ బ్యాక్..
‘భజే వాయు వేగం’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇందులో కార్తికేయ బ్రదర్‌గా ‘హ్యాపీ డేస్’ మూవీ ఫేమ్ రాహుల్ టైసన్ నటించినట్టు అర్థమవుతుంది. ‘హ్యాపీ డేస్’ తర్వాత పలు సినిమాల్లో నటించినా కూడా రాహుల్‌కు తగినంత గుర్తింపు రాలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత ‘భజే వాయు వేగం’తో కమ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. పోస్టర్లలో హీరో ఒక క్రికెటర్ అనే విషయాన్ని హైలెట్ చేసినా.. ట్రైలర్‌లో మాత్రం తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని పలుచోట్ల మాత్రమే చూపించారు. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటించింది. యూవీ కాన్సెప్ట్స్ ‘భజే వాయు వేగం’ను నిర్మించారు. మే 31న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read: సత్యభామ ట్రైలర్ వచ్చేసింది - యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్