Movie Ticket Rates: మూవీ టికెట్ రేట్స్ - కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
Karnataka Government: కర్ణాటక ప్రభుత్వం మూవీ టికెట్ రేట్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు రూ.200 కు మించకుండా ఉండేలా ఉత్తర్వులు ఇచ్చింది.

Karnataka Government Draft Notification On Movie Ticket Rates: మూవీ టికెట్ రేట్స్‌పై సామాన్యులకు ఊరట కలిగించేలా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినోదపు పన్ను సహా టికెట్ రేట్స్ రూ.200 మించకుండా ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని భాషల చిత్రాలు, సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లోనూ ఇది వర్తించనున్నట్లు తెలిపింది.
ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్న సర్కారు... అభ్యంతరాలు ఏమైనా ఉంటే 15 రోజుల్లోగా తెలపాలని సూచించింది. ఆడియన్స్‌కు వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1000 వరకూ ఉన్న సందర్భాలున్నాయని తెలిపింది.
Also Read: 'బాహుబలి: ది ఎపిక్' రన్ టైంపై రూమర్స్ - భల్లాల దేవుడి రియాక్షన్ ఇదే
ఈ ఏడాది మార్చిలో కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో సినీ రంగానికి చెందిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రభుత్వం సభ ముందుకు తెచ్చింది. సామాన్యులకు సైతం తక్కువ ధరలకు వినోదం అందించేలా... మూవీ టికెట్ రేట్స్ రూ.200గా నిర్ణయించాలని సీఎం సిద్ధరామయ్య సభకు తెలిపారు. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలోని అన్నీ షోలకు ఇదే రేట్ ఉంటుందని అన్నారు. అధిక ధరల వల్ల సామాన్య ప్రజలు సినిమాలకు వెళ్లడం తగ్గిపోతుందని... ఆ రంగాన్ని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
వారికి అభ్యంతరం?
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా... మల్టీప్లెక్స్ థియేటర్స్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం ఫార్మాట్స్, ఐమాక్స్, మల్టీప్లెక్స్ భారీ పెట్టుబడితో నిర్మించామని... టికెట్ రేట్స్ ఇలానే ఉంటే తమ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాదిస్తున్నారు. ఈ అంశంపై ఆయా అసోసియేషన్లు కోర్టును కూడా ఆశ్రయిస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు, కన్నడ సినీ పరిశ్రమలో కొన్ని వర్గాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. టికెట్ ధరలు తగ్గితే ప్రజలు థియేటర్లకు ఎక్కువగా వస్తారని... చిన్న సినిమాలకు ఇది ఎంతో ఉపయోగం అని అంటున్నారు. మరి దీని రిజల్ట్ ఏంటో తెలియాల్సి ఉంది.





















