Upendra: దళితులపై హీరో ఉపేంద్ర అనుచిత వ్యాఖ్యలు - కేసు నమోదు, ఆయన స్పందన ఇదీ!
కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో దళితులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీస్ కేసు నమోదు అయింది.
కన్నడ అగ్ర నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్ర తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై FIR ఫైల్ అయింది. దళితులపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన ఆయనపై కేసు నమోదవడంతో చివరికి స్వయంగా ఆయనే క్షమాపణలు చెప్పారు. ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్ర పై పోలీసు కేసు నమోదయింది. ఆ పూర్తి వివరాలకు వెళితే.. ఉపేంద్ర ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఫేస్ బుక్, ఇన్ స్టా లైవ్ సెషన్ నిర్వహించారు. తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో ఆయన దళితుల ప్రస్తావన తీసుకొచ్చారు.
ఈ మేరకు ఫేస్ బుక్ సెషన్ లో ఉపేంద్ర మాట్లాడుతూ.." నిష్కల్మషమైన హృదయంతోనే మార్పు సాధ్యమవుతుంది. ఇలాంటి వాళ్ళందరూ నా వెంట రావాలని, గొంతెత్తి తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరుకుంటున్నాను. వారి సలహాలు మనకు మేలు చేస్తాయి. ఇలాంటి వాళ్లే ఇతరులను అవమానించరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు. కానీ కొందరు మాత్రం చాలా ఖాళీగా ఉంటారు. మనసుకు తోచింది వాగేస్తుంటారు. వాళ్ల గురించి మనం ఏమీ చేయలేం. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉన్నట్టు వీళ్లు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ల గురించి మనం ఏమాత్రం పట్టించుకోవద్దు. అలాగే వాళ్ళ కామెంట్లు చదవద్దు. ప్రజలపై ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే నిజమైన దేశభక్తి" అని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేసే వాళ్లను దళితులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు ఉపేంద్ర.
ఇక ఉపేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దీనిపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతే కాకుండా రామనగర ప్రాంతంలో పలు నిరసన కార్యక్రమాలను సైతం నిర్వహించాయి. కాగా నిరసనకారులు ఉపేంద్ర పోస్టర్లను తగలబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉపేంద్ర పై చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇక తనపై ఇలా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. లైవ్ సెషన్ లో.." నేను ఈరోజు పొరపాటున ఓ అభ్యంతర వ్యాఖ్య చేశాను. ఇది అనేకమంది మనోభావాలను గాయపరిచిందని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెబుతున్నాను" అంటూ ఉపేంద్ర తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఓ పబ్లిక్ ఫిగర్ గా ప్రజలను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్న ఉపేంద్ర తన మద్దతుదారులకు ఆదర్శప్రాయంగా నిలవాలి తప్పా ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కులో పడవద్దని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఉపేంద్ర చివరగా 'కబ్జా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కిచ్చ సుదీప్, శ్రీయ శరణ్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 17న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. కానీ సినిమాలో ఉపేంద్ర నటన ఆకట్టుకుంది. ఆర్ చంద్రుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
Also Read : టీనేజర్లకు చూపించాల్సిన అడల్ట్ చిత్రం ఇది: ‘ఓఎమ్‌జీ 2’కు ఏ సర్టిఫికెట్‌పై అక్షయ్ కౌంటర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial