Indian 2: ‘భారతీయుడు 2’ నిర్మాతలపై నష్టాల భారం - డబ్బు తిరిగిచ్చేయాలంటూ వారి డిమాండ్
Indian 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’.. ఓ రేంజ్‌లో హిట్ అవుతుంది అనుకుంటే శాటిలైట్, ఓటీటీ రైట్స్ కొన్న సంస్థలు డబ్బులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసేంత నష్టాన్ని అందుకుంది.
Losses For Indian 2 Producers: ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమాలు.. యావరేజ్ టాక్ కూడా సంపాదించుకోలేకపోతే నిర్మాతలపై పడే భారం అంతా ఇంతా కాదు. పైగా దాని వల్ల హీరో, దర్శకుల మార్కెట్‌పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఒక రేంజ్‌లో ఖర్చుపెడుతుంటారు మేకర్స్. కానీ ఏం చేసినా కూడా ఒక ప్యాన్ ఇండియా మూవీ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక నష్టాల్లోకి వెళ్లిపోయింది. అదే శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ అలియాస్ ‘భారతీయుడు 2’. ప్రస్తుతం ఈ సినిమాకు వచ్చిన నష్టాల గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.
ఖర్చు పెరగనుంది..
కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిశాస్టర్‌ను మూటగట్టుకున్న సినిమాగా నిలిచింది ‘ఇండియన్ 2’. ‘ఇండియన్ 2’తో పాటు ‘ఇండియన్ 3’కు కూడా కలిపి దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్‌ను ఖర్చుపెట్టారు నిర్మాతలు. రెండో భాగం విడుదల అవ్వకముందే మూడో భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ త్వరలోనే ప్రారంభం అవుతుందని డైరెక్టర్ శంకర్ ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ‘ఇండియన్ 3’కు ఇంకా ఖర్చుపెరగనుందని అర్థమవుతుంది. కానీ ‘ఇండియన్ 2’కు వచ్చిన నష్టాలను చూస్తుంటే మూడో భాగానికి బడ్జెట్ కేటాయించడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తున్నారని కోలీవుడ్‌లో టాక్ మొదలయ్యింది.
విడుదలకు ముందు..
‘ఇండియన్ 2’ థియేటర్లలో విడుదల అవ్వకముందే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ కోసం భారీగా పోటీగా జరిగింది. అందులో భాగంగానే దీనికి సంబంధించిన రైట్స్.. అత్యధిక ప్రైజ్‌కు అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఈ మూవీ సత్తా చాటింది. కానీ థియేటర్లలో విడుదలయిన తర్వాత ప్రేక్షకులను మెప్పించే విషయంలో ‘ఇండియన్ 2’ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. కేవలం రూ.70 కోట్ల షేర్ సాధించి భారీ నష్టాలను చవిచూసింది ఈ సినిమా. దీంతో ఈ చిత్ర నిర్మాత సంస్థలు అయినా లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంట్ ఫిల్మ్స్‌పై అదనపు భారం పడింది.
డబ్బు ఇచ్చేయాలి..
థియేటర్లలో ‘ఇండియన్ 2’ ఫెయిల్ అవ్వడంతో భారీ ప్రైజ్ పెట్టి రైట్స్‌ను కొనుగోలు చేసిన శాటిలైట్ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్.. తమ డబ్బును వెనక్కి ఇచ్చేయమంటూ బేరాలు మొదలుపెట్టాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమయ్యిందని, కానీ స్ట్రీమింగ్ మొదలవ్వాలంటే కొంత డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ యాజమాన్యం డిమాండ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటోమేటిక్‌గా ‘ఇండియన్ 3’ బిజినెస్‌పై ప్రభావం పడనుంది. రెండు భాగాలు కలిసి రూ.600 కోట్లు సాధించి ఉంటే కనీసం బ్రేక్ ఈవెన్ వరకు అయినా చేరుకునేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: ‘డార్లింగ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?