Kalki 2898 AD: ‘కల్కీ 2898 ఏడీ’లో భైరవ ఎంట్రీ సీన్‌కు అంత టైమ్ పడుతుందా? షాకింగ్ విషయం చెప్పిన నాగ్ అశ్విన్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కీ 2898 ఏడీ’ మూవీకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ పలు కీలక విషయాలను రివీల్ చేశారు. భైరవ ఎంట్రీ సీన్ ఎన్ని నిమిషాల తర్వాత రానుందో చెప్పేశారు.
‘కల్కీ 2898 AD’ మూవీ ఫీవర్ మొదలైపోయింది. మరికొద్ది గంటల్లో మూవీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఆ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్.. హీరో ప్రభాస్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో ముచ్చటించారు. కల్కీ మూవీలోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే, ప్రభాస్ ఆ మూవీలో నటించిన ఇద్దరు హీరోల పేర్లను లీక్ చేసేశాడు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నాడు. ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమేనని చెప్పేశాడు. ‘కల్కీ 2898 AD’లో కనిపించబోతున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్.
ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ మూవీలో నటించిన విజయ్, దుల్కర్‌లకు నా ధన్యవాదాలు అని తెలిపాడు. అంతలోనే.. వాళ్ల పేర్లను రివీల్ చేసేశానా.. అలర్ట్ చేయాల్సిందని అన్నాడు. నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. పర్వాలేదు, వాళ్ల అభిమానులు కూడా సంతోషిస్తారు. ఇప్పటికే వారి కటౌటులు కూడా పెట్టేశారని తెలిపారు. దీంతో ప్రభాస్ మరోసారి విజయ్, దుల్కర్‌లకు థాంక్స్ చెప్పాడు. ఈ సినిమాకు మీరు మరింత బలమిచ్చారని తెలిపాడు.
చివరిలో ఆర్ఆర్ అదిరిపోద్ది
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. చివరిలో ఒక ఆర్ఆర్ సాంగ్ ఉంటుంది. అది మీకు తప్పకుండా నచ్చుతుంది. అది నా ఫేవరెట్ కూడా అని తెలిపారు. అలాగే.. ఈ మూవీ ఐడియా వచ్చి ఎన్నాళ్లు అవుతుందని ప్రభాస్ అడిగిన ప్రశ్నకు నాగ్ బదులిస్తూ.. ‘‘సుమారు 4, 5 ఏళ్లు అవుంది. కరోనాకు ముందు అనుకుంటా ఈ కథతో మిమ్మల్ని కలిశాను. నరేషన్‌లో నేను చాలా వీక్. రాయమంటే రాసేస్తాను. కానీ చెప్పలేను’’ అని అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. అవును, కథ చెప్పేప్పుడు మీరు చాలా నర్వెస్‌గా ఉన్నట్లు అనపించింది. ఇంతకీ ఆ కారులో నుంచి వ్యక్తి ఎవరు అని అడిగితే.. భైరవా అన్నారు. ఓహో భైరవా అంటే నా క్యారెక్టర్ అని అర్థం చేసుకున్నా’’ అని అన్నాడు.
‘‘మీ నరేషన్‌తో దీపికాను ఎలా ఒప్పించగలిగారు.. పైగా ఆమె సినిమా మొత్తం గర్భవతిగానే ఉండాలి. దానికి ఆమె ఎలా ఒప్పుకుంది?’’ అని ప్రభాస్ అడిగాడు. ఇందుకు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘ఆమెకు సగం సగం కథే చెప్పా. అయితే, ఆమె ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం మీరు (ప్రభాస్). మీతో కలిసి వర్క్ చేయాలనే ఆమె ఒకే చెప్పారు. అలాగే ఆమె ‘మహానటి’ సినిమా కూడా చూశారట. అందుకే, ఆమె వెంటనే ఒకే చెప్పేశారు’’ అని తెలిపారు.
అమితాబ్‌కు చేతబడి చేశారా?
‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మీరు అమితాబ్ బచ్చన్ వంటి స్టార్‌ను కూడా ఈ మూవీకి ఒప్పించగలిగారు. అసలు ఏం చేశారు? చేతబడిగానీ చేశారా?’’ అని ప్రభాస్ ప్రశ్నించారు. ‘‘అదేమీ లేదు. ఆయనకు ఈ మూవీకి సంబంధించిన మూలకథ నచ్చినట్లుంది. ఆయన పాత్రను వివరించగానే ఓకే చెప్పారు. ఇక కమల్ హాసన్ అయితే వెంటనే ఓకే చెప్పేశారు’’ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ‘‘అప్పట్లో పెద్ద నాన్న మీరు పెద్ద దర్శకుడు అవుతారని, తప్పకుండా మీతో సినిమా చెయ్యాలని అన్నారు. మొత్తానికి అది ఇప్పటికి నెరవేరింది’’ అని తెలిపాడు.
20 నిమిషాల తర్వాతే భైరవ పాత్ర ఎంట్రీ
ఈ మూవీలో భైరవ పాత్ర ఎంట్రీ గురించి కూడా నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. ఈ మూవీలో 20 నిమిషాల తర్వాత భైరవ పాత్ర ఎంట్రీ ఉంటుందని చెప్పారు. ఇందుకు ప్రిపేర్‌గా ఉండాలని ప్రభాస్‌తో అన్నారు. ఆ 20 నిమిషాల్లో చాలా పాత్రలు, కథ ఉంటుందని.. అందుకే భైరవ ఎంట్రీ ఆలస్యంగా ఉంటుందన్నారు. అయితే, భైరవ ఎంట్రీని చూసి థియేటర్లలో తప్పకుండా విజిల్స్ వెస్తారని అన్నారు. అలాగే, అన్ని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటే.. భైరవ, బుజ్జి పాత్రలు మాత్రం చాలా ఫన్నీగా.. మనకెందుకురా బాబు ఇదంతా అన్నట్లుగా ఉంటాయన్నారు. పిల్లలు సైతం ఇష్టపడే ఇన్నోసెంట్ సూపర్ హీరోలా భైరవ పాత్రను క్రియేట్ చేశానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. మహాభారతం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడం వల్ల.. పిల్లలు తప్పకుండా దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తారని తెలిపాడు. వారు మహాభారతాన్ని, అశ్వత్థామ పాత్ర గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తారని ప్రభాస్ పేర్కొన్నాడు.
Also Read: తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన దీపికా - ప్రభాస్ అయితే కాదు!