Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లోకి రాజమౌళి ఎంట్రీ, నిజంగా అలా చేస్తున్నారా?
ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో రాజమౌళి అతిథి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్, గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.
‘కల్కి 2898 ఏడీ’లో రాజమౌళి అతిథి పాత్ర
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు గ్లింప్స్ విడుదలైన సందర్భంగా చిత్ర బృందాన్ని రాజమౌళి ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఆయన ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సినిమాలో కీలక పాత్ర పోషించడంతో పాటు దర్శక విభాగానికి కూడా ఆయన కీలక సలహాలు, సూచనలు ఇస్తున్నారట. చిత్రబృందం రాజమౌళి సూచనల మేరకు పలు కీలక మార్పులు, చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సీన్ల విషయంలో ఎలా చిత్రీకరిస్తే బాగుంటుంది? అంటూ రాజమౌళి నుంచి సలహాలు తీసుకుంటుందంట. తాజా ఊహాగానాల నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి. అయితే, రాజమౌళి అతిథి పాత్ర, దర్శకత్వ విభాగానికి సూచనలు ఇవ్వడానికి సంబంధించిన విషయాలపై అధికార ప్రకటన మాత్రం రాలేదు.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై భారీగా అంచనాలు
‘కల్కి 2898 ఏడీ’లో ఇప్పటికే పలువురు దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. మరో బాలీవుడ్ తార దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరికి కూడా నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా రాజమౌళికి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
జనవరి 12న ‘కల్కి 2898 ఏడీ’ విడుదల
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. ఇటీవల విడుదల చేసిన దీని గ్లింప్స్ వీడియో అభిమానులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Read Also: నా కెరీర్‌లోనే తొలిసారి, ‘చంద్రముఖి 2’ కోసం ఆ మాట అడిగాను - కంగనా రనౌత్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial