Jyothi Poorvaj - A Masterpiece Update: త్రేతాయుగంలో శ్రీరాముడు... ద్వాపర యుగంలో హిరణ్యకశ్యపుడు... మరి కలియుగంలో? - జ్యోతి పూర్వాజ్ 'మాస్టర్ పీస్' సంగతులు
త్రేతా యుగానికి, ద్వాపర యుగానికి, కలి యుగానికి లింక్ చేస్తూ అద్భుతమైన కథ చెప్పబోతున్నామని దర్శకుడు పూర్వాజ్ పేర్కొన్నారు. ఆయన హీరోగా తీస్తున్న 'ఏ మాస్టర్ పీస్' వివరాలు ఏమిటంటే?

'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలతో దర్శకుడు పూర్వాజ్ (Director Purvaj) అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన రూపొందిస్తున్న కొత్త సినిమా 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. 'ఏ మాస్టర్ పీస్' సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి మీడియాని ఆహ్వానించారు. షూటింగ్ ఎలా జరుగుతోందో మీడియాకు చూపించి.. చిత్ర విశేషాల్ని యూనిట్ పంచుకుంది.
ఈ క్రమంలో దర్శకుడు పూర్వాజ్ ‘ఏ మాస్టర్ పీస్’ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల వల్లే ఈ ప్రాజెక్ట్ మొదలైందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మనీష్ గిలాడ మా చిత్ర ప్రొడక్షన్ లో భాగమై సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారని మరో నిర్మాత గురించి చెప్పుకొచ్చారు. నిర్మించడమే కాకుండా ఆయన ఈ చిత్రంలో సూపర్ విలన్‌గా నటిస్తున్నారని తెలిపాడు. అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో సూపర్ హీరోగా కనిపిస్తారని అన్నాడు. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుందని, ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో పాత్రను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశామని తెలిపాడు.
శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి లింక్ చేస్తూ ఓ అద్భుతమైన కథను చూపించబోతోన్నామని అన్నారు. డిఫరెంట్ పాత్రల్లో తన భార్య జ్యోతి పూర్వజ్ ఎంతో బాగా నటించారని తెలిపారు ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోందని తెలిపారు. అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ఏ మాస్టర్ పీస్ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ పూర్వాజ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు. ఈ షూట్ సమయంలో ఎన్నో సార్లు గాయాలు అయ్యాయని, దాంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేయాల్సివచ్చిందని తెలిపారు. తనకోసం డైరెక్టర్ పూర్వాజ్ గారు చాలా వెయిట్ చేశారని అన్నారు.
తనకే కాదు తమ టీమ్ లోని చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి అని తెలిపారు. అవన్నీ గుర్తొస్తే తాను ఎమోషనల్ అవుతానని అన్నారు. ఏదో గొప్పగా సాధించబోయో ముందు ఇలాంటి కష్టాలు వస్తుంటాయని అంటారు అని తమ సినిమా కష్టాల్ని పంచుకున్నారు. "ఏ మాస్టర్ పీస్" సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రూపొందుతోందని అన్నారు. సూపర్ విలన్, ప్రొడ్యూసర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ మా "ఏ మాస్టర్ పీస్" మూవీ టీజర్ రిలీజ్ చేసి 14 నెలలు అవుతోందని, ఇప్పుడు క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని అన్నారు. హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ తాను రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చానని తెలిపారు. ఆ తర్వాత ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా లైఫ్ పార్టనర్‌గా మారారు అని తెలిపారు. సూపర్బ్ స్క్రిప్ట్‌తో ఈ చిత్రం వస్తోంది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో తన పాత్ర ఉంటుందని తెలిపారు. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్ హీరో చిత్రాన్ని మనం తెలుగులో ఎందుకు చేయకూడదు అని అనిపించిందని, అందుకే ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌తో "ఏ మాస్టర్ పీస్" తీస్తున్నామని అన్నారు.
Also Read: ఘాటీ vs లిటిల్ హార్ట్స్... బాక్సాఫీస్ కలెక్షన్లలో మౌళి మూవీ ముందు అనుష్క సినిమా గల్లంతు!





















