Janaki Vs State Of Kerala: యూటర్న్ తీసుకున్న సెన్సార్ బోర్డు... సురేష్ గోపి - అనుపమ సినిమా ఇష్యూలో కొత్త ట్విస్ట్
Suresh Gopi Anupama Movie: కేంద్రమంత్రి, మలయాళ హీరో సురేష్ గోపితో పాటు అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు యూటర్న్ తీసుకుంది.

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మలయాళ కథానాయకుడు సురేష్ గోపి (Suresh Gopi). ఆయన నటించిన తాజా సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (Janaki Vs State Of Kerala). ఇందులో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు యూటర్న్ తీసుకుంది. రెండు మార్పులతో సినిమా విడుదలకు ఓకే చెప్పింది. అసలు సెన్సార్ వివాదం, లేటెస్ట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే...
సినిమా విడుదలకు అభ్యంతరం లేదు...
96 కట్స్ కాదు... టైటిల్ మారిస్తే చాలు, ఇంకా!?
Anupama Parameswaran Role In Janaki Vs State Of Kerala: 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి జానకి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. సీతా దేవికి మరొక పేరు జానకి. ప్రధాన పాత్రధారి పేరును హిందువులు ఎంతో పరమ పవిత్రంగా పూజించే సీతా దేవిని సూహించే విధంగా పేర్కొనడం పట్ల సెన్సార్ బోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేరళలోని రీజనల్ సెన్సార్ బోర్డు నుంచి 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాకు ఎటువంటి అభ్యంతరం రాలేదు. అయితే ముంబైలోని సెన్సార్ బోర్టు టైటిల్ మార్చమని సూచించింది. సీతా దేవిని హిందువులు పూజిస్తారు గనుక ఆ పేరును మార్చాలని సూచించడంతో పాటు సినిమాలో 96 కట్స్ విధించినట్లు సమాచారం. ముంబై సెన్సార్ బోర్డ్ తీరు పట్ల చిత్ర దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెన్సార్ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సెన్సార్ బోర్టు యూటర్న్ తీసుకుంది.
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' టైటిల్ బదులు 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' లేదా 'వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అని పెడితే బావుంటుందని సెన్సార్ బోర్డు సూచించింది. టైటిల్ మార్చాలని పేర్కొంది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పూర్తి పేరు జానకి విద్యాధరన్. ఆమె పేరు మొత్తం వచ్చేలాగా టైటిల్ ఉంటే బాగుంటుందని పేర్కొంది.
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' టైటిల్ మార్పుతో పాటు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే సమయంలో జానకి పేరును మ్యూట్ చేయాలని సూచించింది. జానకి ఒక మతానికి చెందిన అమ్మాయి కాగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది మరొక మతానికి చెందిన వ్యక్తి అని... ఎటువంటి మత కలహాలు - ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఆ మార్పును సూచిస్తున్నట్లు తెలిపింది. దర్శక నిర్మాతల అభిప్రాయాలు చెప్పమని కోర్టు పేర్కొంది.
Also Read: నయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?
సెన్సార్ బోర్డు ముందు చేసిన సూచనలతో పోలిస్తే తాజా మార్పులు పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదు. దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. జూలై 5న కోర్టు సినిమా చూసింది. త్వరలో సినిమా విడుదలపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. తొలుత జూన్ 20న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సెన్సార్ ఇష్యూ వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పుడు క్లియర్ అయ్యే సూచనలు ఉన్నాయి కనుక త్వరలో కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తారు. తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది.





















