Jailer Trailer : మాటల్లేవ్, కోతలే - కుమ్మేసిన రజనీకాంత్, హిట్టు బొమ్మే!
Rajinikanth Jailer Trailer Review : రజనీకాంత్ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో? ఆ అంశాలు అన్నీ 'జైలర్'లో కనబడుతున్నాయి. 'జైలర్' షోకేస్ పేరుతో విడుదల చేసిన ట్రైలర్లో హిట్టు కళ కనబడుతోంది.
'జైలర్'... సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా. సినిమా విడుదలకు ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. అయితే, 'జైలర్' (Jailer Movie)పై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం... 'నువ్ కావాలయ్యా' సాంగ్, అందులో రజనీతో పాటు తమన్నా వేసిన స్టెప్పులు! పాట ఓకే! మరి, ట్రైలర్ సంగతి ఏంటి? అందుకు సమాధానం ఈ రోజు లభించింది.
మాటల్లేవ్... కోతలే!
Jailer Telugu Trailer : 'జైలర్' ట్రైలర్ చూసిన మన తెలుగు ప్రేక్షకులకు ముందు సంతోషం కలిగించే అంశం ఏమిటంటే... సునీల్ ఎంట్రీ! రజనీ కంటే ముందు స్క్రీన్ మీద ఆయన కనిపించారు. సీబీఐ అధికారులు ఇంటికి వస్తే... 'డొనేషన్ ఏమైనా కావాలా?' అని సునీల్ అడుగుతారు.
సునీల్ ఎంట్రీకి ముందు యాక్షన్ సన్నివేశాలు వచ్చాయి. పోలీసు వాహనాలపై ఎవరో అటాక్ చేసినట్లు చూపించారు. దాంతో మాంచి యాక్షన్ సినిమా అని ఫీల్ కలిగించారు. రజనీకాంత్ ఎంట్రీ అయితే హైలైట్! ఆయన్ను చాలా పిరికివాడిగా చూపించారు. పిల్లి నుంచి పులిగా మారినట్లు హీరోయిజం చూపించారు. అక్కడి నుంచి అసలు సిసలైన యాక్షన్, సూపర్ స్టార్ హీరోయిజం మొదలయ్యాయి. క్యారెక్టర్ విషయానికి వస్తే... రజినీకాంత్ 'జైలర్' రోల్ చేశారు. ఆయన భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించారు. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. రజనీకాంత్ కుమారుడు పోలీస్. మనవడి మీద ఎటాక్ జరగబోతే... రక్షించడం, ఆ తర్వాత విలన్స్ మీద రజనీకాంత్ ఎటాక్ చేయడం కథగా తెలుస్తోంది.
'నువ్వు ఆయన్ను చూసింది ఒక పోలీసోడి తండ్రిగానే. కానీ, ఆయనలో నువ్వు చూడని ఇంకొకడిని నేను చూశాను' అని హిందీ నటుడు జాకీ ష్రాఫ్ చెప్పే డైలాగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ''ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. కోతలే'' అని చిరునవ్వుతో పాటు కోపాన్ని ప్రదర్శిస్తూ రజనీకాంత్ చెప్పే డైలాగ్ ట్రైలర్ మొత్తం మీద హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు అన్నీ సరిగ్గా కుదిరాయి. హిట్టు కళ కనబడుతోంది.
Also Read : ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' - ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదు!
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. నయనతార 'కో కో కోకిల', శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్ 'బీస్ట్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రజనీకి 169వ చిత్రమిది.
Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు
ఆగస్టు 10న థియేటర్లలోకి 'జైలర్'
Jailer Movie Release Date : ఆగస్టు 10న 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్, కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు, రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial