Mohan Babu Vs Naga Babu : మోహన్‌బాబు కేసు పెట్టిన వ్యక్తికి నాగబాబు అండ ! మళ్లీ కోల్డ్ వార్ స్టార్టవుతుందా ?
మోహన్ బాబు ఫ్యామిలీ ఇటీవల ఓ వ్యక్తిపై కేసు పెట్టింది.ఆ వ్యక్తిని మెగా బ్రదర్ నాగబాబు పిలిచి ఆర్థిక సాయం చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీంతో మెగా, మంచు శిబిరాల మధ్య మళ్లీ కోల్డ్ వార్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరో సారి మంచు వర్సెస్ మెగా కోల్డ్ వార్ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి మెగా బ్రదర్ నాగబాబు ( Naga Babu ) ఆజ్యం పోశారని అనుకోవాలి. ఎలా అంటే ఇటీవల మోహన్ బాబు ఫ్యామిలీ ( Mohan Babu Family )అనేక వివాదాల్లోకి వస్తున్నారు. అలాంటి వివాదాల్లో ఒకటి తమ దగ్గర పని చేసిన నాగశీను అనే హెయిర్ డ్రెస్సెర్‌పై ( Hair Dresser )కేసు పెట్టడం. రూ. ఐదు లక్షల విలువైన విగ్గులు తీసుకెళ్లిపోయారంటూ ఆయనపై పోలీసులకు మంచు విష్ణు ( Manchu Vishnu ) మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఆ మేనేజర్ మీడియా ముందుకు వచ్చి మంచు ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ హెయిర్‌డ్రెస్సెర్‌ను తన వద్దకు పిలిపించుకున్న నాగబాబు ఆర్థిక సాయం చేశారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మోహన్ బాబు కుటుంబం వద్ద పదేళ్లుగా పని చేసినట్లు నాగశ్రీను ( Naga Srinu ) చెబుతున్నారు. ఈ కారణంగా ఇండస్ట్రీని నమ్ముకున్నే వ్యక్తే కాబట్టి కష్టాల్లో ఉన్నాడని నాగేంద్రబాబు కుటుంబంతో సహా ఆహ్వానించారు. పిలిచి ధైర్యం చెప్పి రూ. యాభై వేల సాయం చేశారు. తల్లి వైద్యానికి.. పిల్లలకు వైద్య పరీక్షలు చేయిస్తానని హామీ ఇచ్చారు . ఇది సహజంగానే మంచు కుటుంబానికి ఆగ్రహం కలిగిస్తుంది. నాగబాబు పిలిచి ఆర్థిక సాయం చేశారంటే.. అది మోహన్ బాబు మీద ప్రత్యేకంగా రివెంజ్ తీర్చుకోవడానికేనని ఎక్కువ మంది భావిస్తారు.
ఎందుకంటే "మా" ఎన్నికల్లో ( MAA Elections ) నేరుగా పోటీ పడింది ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ కావొచ్చు కానీ పరోక్షంగా పోటీ జరిగింది మాత్రం మోహన్ బాబు, నాగబాబు మధ్యే. ఆ తర్వాత కూడా కోల్డ్ వార్ సాగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో తాము కేసు పెట్టిన వ్యక్తిని నాగబాబు చేరదీస్తే మోహన్ బాబు ఫ్యామిలీ ఊరుకునే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అందుకే మోహన్ బాబు.. మెగా ఫ్యామిలీపై మరోసా రి ఎటాక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మంచు విష్ణు పెట్టిన దొంగతనం కేసులో హెయిర్ డ్రెస్సెర్ నాగశీనుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు కానీ.. నాగశ్రీను మీడియాతో చెప్పిన అంశాలు మాత్రం వైరల్ అవుతున్నాయి. కులం పేరుతో తిట్టారంటూ నాగశ్రీను చేసిన వ్యాఖ్యలతో బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య ( R.Krishnayya ) తెరపైకి వచ్చారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చే్సతున్నారు. మొత్తంగా నాగశ్రీనుకు బీసీ సంఁఘాల అండతో పాటు ఇండ్ట్రీలో మెగా క్యాంప్ భరోసా కూడా లభించింది. ఇప్పుడు మోహన్ బాబు సైలెంట్‌గా ఉంటే విశేషం అవుతుంది.. స్పందిస్తే ఇంకా సంచనలం అవుతుంది. మరి మోహన్ బాబు ఏం చేస్తారు..?