Hyderabad Drugs Case:నటుడు నవదీప్ మెడకు డ్రగ్స్ కేసు ఉచ్చు, నోటీసులు జారీ చేసిన పోలీసులు
నటుడు నవదీప్ మెడకు మరోసారి డ్రగ్స్ కేసు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే ఎక్సైజ్ విచారణకు హాజరు కాగా, తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దొరికిన డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనన నుంచి పోలీసులు కీలక విషయాలు సేకరించారు. నవదీప్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అంచనాకు వచ్చారు.
నవదీప్‌కు నోటీసులు
ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే, ఇప్పటికే ఆయనతో పాటు ఆయన కుటుంబం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. "ప్రస్తుతానికి నవదీప్ తో పాటు అతడి కుటుంబం అందుబాటులో లేదు. అన్ని ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా ఆయన పరారయ్యారు’’ అని తెలిపారు. ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ పేరు ఉంది. అప్పట్లో ఎక్సైజ్ తో పాటు ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యాడు.
నవదీప్ ఏమన్నాడంటే?
అటు డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మీరు చెప్తున్న నవదీప్ నేను కాదు జెంటిల్మెన్. నేను ఇక్కడే ఉన్నాను. దయచేసి క్లారిటీ తెచ్చుకోండి. థాంక్స్" అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మీడియాతోనూ ఆయన మాట్లాడాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాదులోని ఉన్నానని చెప్పాడు. డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించాడు. తాను కూడా ప్రెస్ మీట్ చూశానని, కమిషనర్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని చెప్పాడు. అతను వేరే నవదీప్ అయి ఉంటాడని వెల్లడించాడు.
డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులు
అటు మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ దర్శకుడు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డీలర్ బాలాజీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. హీరో నవదీప్, ‘షాడో’, ‘రైడ్’ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేష్ రావు, ఇంద్రతేజ్, కార్తీక్‌తోపాటు కలహర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక ప్రస్తుతం నవదీప్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సీజన్ 2 కూడా రాబోతోంది.
Read Also: ఆ ఓటీటీకి ‘జవాన్‘ రైట్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial