VFX Summit 2023: ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు, నెలకు ఒక్క సినిమా చాలనుకున్నాం: నాగార్జున
నెలకు ఒక్క సినిమా షూటింగ్ జరిగినా చాలు - నాగార్జున ఎన్నో కష్టాలు పడి సినిమా పరిశ్రమను నిలబెట్టాం - నాగార్జున.
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో, యువ సామ్రాట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. ప్రేక్షకులలో ఆయనకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్ కొనసాగిస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు నాగార్జున. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాగార్జున యువ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా నాగార్జున తెలుగు ఫిలిం ఇండస్ట్టీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 70వ దశకంలో ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు నాగార్జున. అయితే ఇప్పటికి కూడా తనకు టెక్నికల్‌గా అవగాహన లేదని అన్నపూర్ణ స్టూడియో టీం తనను గైడ్ చేస్తుందన్నారు.
హైదరాబాద్ వేదికగా జరగుతున్న వీఎఫ్‌ఎక్స్ సమ్మిట్‌లో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమా పరిశ్రమకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గుండె కాయలాంటిది అన్నారు. దేశం మొత్తం మీద సినిమాలు ఎంత కలెక్షన్ వసూలు చేస్తాయో.. అంతే వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తాయన్నారు నాగార్జున. టెక్నికల్‌గా రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు. సంవత్సరం కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. అయితే నాగార్జున తనకైతే టెక్నికల్‌గా పెద్దగా అవగాహన లేదని వీఎఫ్‌ఎక్స్ గురించి ఏం మాట్లాడాలో తెలియదన్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియో టెక్నికల్ టీం తనను ఎప్పుడూ గైడ్ చేస్తుంటారని తెలిపారు.
హైదరాబాద్ తో అక్కినేని కుటుంబానికి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని గత జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు నాగ్. 1974 లో దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించినప్పుడు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో స్టూడియోలో నెలకు ఒక్క సినిమా షూటింగ్ జరిగినా చాలు అనుకునే పరిస్థితులు ఉండేవన్నారు. ఎన్నో కష్టాలు పడి సినిమా పరిశ్రమను హైదరాబాద్‌లో నిలబెట్టామన్నారు నాగార్జున. అటువంటి స్థితి నుంచి ఇవాళ హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ ఎంత అభివృద్ది చెందిందో ఈ ఇండియా జాయ్ కార్యక్రమం చూస్తుంటే అర్థం అవుతుందన్నారు నాగార్జున.
తెలుగు ప్రజలకు సినిమాలంటే పిచ్చి అందుకే ఇక్కడ పరిశ్రమ ఇంతలా అభివృద్ది చెందుతుందన్నారు నాగార్జున. ఇప్పడు ఇండియా మొత్తం దక్షిణాది సినిమాల వైపు చూస్తుందన్నారు. దానికి కారణం మనం ఆస్కార్ దాకా వెళ్లడమేనన్నారు. అటు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు మన దగ్గర ఉండటం కూడా మన పరిశ్రమ తారాస్థాయికి వెళ్లిందన్నారు నాగార్జున. హైదరాబాద్‌లో వీఎఫ్‌ఎక్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న ఇండియా జాయ్ టీంకి అభినందనలు తెలిపారు. ఇక సినిమా పరిశ్రమ అభివృద్ది కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని.. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు నాగార్జున థాంక్స్ చెప్పారు.
Also Read : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ, మెహందీ టైమింగ్స్? ఇవిగో పూర్తి వివరాలు