Hari Hara Veera Mallu Teaser: హరహర వీరమల్లు టీజర్ వచ్చేసింది - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ గ్యారంటీ
Hari Hara Veera Mallu Teaser Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా 'హరి హర వీరమల్లు' టీజర్ వచ్చేసింది. అది ఎలా ఉంది? అందులో ఏముంది? అనేది ఒక్కసారి చూడండి.
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో ఎక్కువ వినబడుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. జనసేన పార్టీ అభ్యర్థులకు అండగా... అదే విధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి అండగా జోరుగా హుషారుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులపై ఆయన వేసే పంచ్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే... ఆయన నుంచి సినిమా కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకు 'హరి హర వీరమల్లు' టీమ్ మంచి గిఫ్ట్ ఇచ్చింది.
'హరి హర వీరమల్లు' టీజర్ వచ్చేసింది!
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu Movie). ఈ చిత్రాన్ని పవన్ హీరోగా 'ఖుషి' వంటి కల్ట్ క్లాసిక్ ప్రొడ్యూస్ చేసిన ఏయం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ రూపొందిస్తోంది. ఇవాళ సినిమా టీజర్ విడుదల చేశారు.
వీరమల్లు టీజర్ ఎలా ఉందంటే?
Hari Hara Veera Mallu Teaser Review: 'ధర్మం కోసం యుద్ధం' అంటూ 'హరి హర వీరమల్లు' టీజర్ విడుదల చేశారు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్, మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఆ టీజర్ ఎలా ఉందో మీరూ చూడండి.
Also Read: 'కూలీ'పై ఇళయరాజా గరమ్ గరమ్ - లీగల్ చిక్కుల్లో రజనీకాంత్ సినిమా
'మన ప్రాణానికి విలువే లేదా నాన్నా? మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు' అని ఓ చిన్నారి తండ్రిని అడిగే ప్రశ్నతో 'హరిహర వీరమల్లు' టీజర్ విడుదలైంది. ఆమె మాటలు నేపథ్యంలో వినిపిస్తుంటే.... తెరపై సామాన్యులపై మొఘలుల అండతో సైన్యం చేస్తున్న అరాచకాలు చూపించారు. ఆ తర్వాత తండ్రి 'ప్రతి వాడిని పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే... దొరని గోల్కొండ నవాబ్ దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి' అని తండ్రి చెబుతుంటే... తెరపై మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ ను చూపించారు.
'మనపై ఉన్న ఈ దొంగలు అందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరి చేస్తాడు' అని తండ్రి చెప్పగానే... తెరపై పవన్ కళ్యాణ్ ఎంట్రీ. వీరుడిగా ఆయన వీరోచిత పోరాటం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'హరి హర వీరమల్లు. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. అంటే ఆయనది రాబిన్ హుడ్ క్యారెక్టర్ అన్నమాట. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది.
Also Read: కల్కి నిర్మాతలతో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?