Ravi Teja: రవితేజ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న ఫిబ్రవరి నెల, ఎందుకంటే?
Ravi Teja's Eagle: రవితేజ నటించిన 'ఈగల్' సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించి ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే ఓ బ్యాడ్ సెంటిమెంట్ కారణంగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
Ravi Teja: టాలీవుడ్ లో సంక్రాంతిని సినిమా పండుగగా భావిస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఎవరికి వారు తగ్గేదే లే అంటూ 5 చిత్రాలు బరిలో దిగుతున్నట్లు ప్రకటించేశారు. దీంతో థియేటర్ల సమస్య తలెత్తింది. సినీ పెద్దల జోక్యంతో ఎట్టకేలకు 2024 పొంగల్ సినిమాల వివాదం ఓ కొలిక్కి వచ్చింది. 'ఈగల్' మూవీ పోటీ నుంచి తప్పుకొని ఫిబ్రవరిలో రాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫైనల్ గా 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు బరిలో నిలిచాయి. అయితే ఇప్పుడు రవితేజ మూవీ కొత్త విడుదల తేదీ విషయంలో ఆయన అభిమానులు కాస్త కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న విడుదల చేయాలని మేకర్స్ ముందునుంచి సన్నాహాలు చేశారు. అయితే సినీ పరిశ్రమ సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకొని ఈ సినిమాని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను వెల్లడించారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ, గత రికార్డులను పరిశీలిస్తే రవితేజకు ఫిబ్రవరి నెల పెద్దగా కలిసి రాలేదనే విషయం స్పష్టమవుతోంది.
రవితేజ హీరోగా హరీష్ శంకర్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన 'షాక్' సినిమా 2006 ఫిబ్రవరి 9న విడుదలై పరాజయం పాలయ్యింది. 2012లో గుణశేఖర్ తెరకెక్కించిన 'నిప్పు' చిత్రం ఫిబ్రవరి 17న రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత 2018 ఫిబ్రవరి 2న 'టచ్ చేసి చూడు' మూవీ వచ్చింది. విక్రమ్ సిరికొండ అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఇక గతేడాది రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా సైతం ఫిబ్రవరి 11న తెలుగు హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో విడుదలయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ అయింది.
Also Read: బాక్సాఫీస్ వద్ద కాటేరమ్మ కొడుకు ప్రభంజనం!
ఇలా ఫిబ్రవరి నెలలో రిలీజైన రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ దారుణమైన ఫలితాలను చవి చూశాయి. అలాంటిది ఇప్పుడు 'షాక్' రిలీజైన అదే ఫిబ్రవరి 9న 'ఈగల్' మూవీ విడుదల కాబోతోంది. ఇదే మాస్ రాజా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. తమ హీరో సినిమా ఫిబ్రవరి బ్యాడ్ సెంటిమెంట్ కు బలి అవుతుందేమో అనే ఆలోచనలో పడేస్తోంది. దీనికి తోడు అప్పుడు కూడా ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
'ఈగల్' కోసం 'టిల్లు స్క్వేర్' ను సితార నిర్మాతలు వాయిదా వేసినా, మరో రెండు సినిమాల నుంచి పోటీ తప్పేలా లేదు. వైఎస్ జగన్ బయోపిక్ గా పేర్కొనబడిన 'యాత్ర 2' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 8న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అలానే ఫిబ్రవరి 9న 'ఊరి పేరు భైరవకోన' సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ పోటీని తట్టుకొని, ఫిబ్రవరి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రవితేజ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.
ఇకపోతే 'ఈగల్’ కొత్త రిలీజ్ డేట్‌ను తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ''బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్’ను ఫిబ్రవరికి తీసుకొస్తున్నాం. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు, టీమ్ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారు. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు’’ అని పేర్కొన్నారు. 'మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం. రావడంలో కొద్ది మార్పు, షాట్ & టార్గెట్ లో కాదు' అని రవితేజ ట్వీట్ చేశారు.
Also Read: ‘మీర్జాపూర్ 3' to 'ఫ్యామిలీ మ్యాన్ 3' - 2024లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే!